బెజవాడలో యువకుడి కాల్చివేత

12 Oct, 2020 03:29 IST|Sakshi
మహేశ్‌ (ఫైల్‌)

పిస్టల్‌తో కాల్చి చంపిన ఆగంతకులు

మృతుడు.. పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్‌ మహేశ్‌గా గుర్తింపు

నిందితుల కోసం 3 ప్రత్యేక పోలీస్‌ బృందాల ఏర్పాటు 

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ నగర శివారు నున్నలో శనివారం అర్ధరాత్రి ఒక యువకుడిని 7.65 ఎంఎం పిస్టల్‌తో ఆగంతకులు కాల్చిచంపారు. మృతుడిని విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే గజకంటి మహేశ్‌గా గుర్తించారు. నున్న బైపాస్‌ రోడ్డులోని బార్‌ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఆగంతకులు పది రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. పథకం ప్రకారమే హతమార్చినట్టు భావిస్తున్నారు.

విజయవాడ క్రీస్తురాజుపురంకు చెందిన గజకంటి మహేశ్‌ (33) తన స్నేహితులు.. కుర్రా హరికృష్ణ, ఉయ్యూరు దినేశ్, యండ్రపతి గీతక్‌ సుమంత్‌ అలియాస్‌ టోనీ, కంచర్ల అనుదీప్‌ అలియాస్‌ దీపులతో కలిసి శనివారం అర్ధరాత్రి బార్‌కు సమీపంలో రోడ్డుపైన మద్యం సేవిస్తూ కూర్చున్నాడు.

బీరు కొనుగోలుకు టోనీ, దీపు బార్‌కు వెళ్లారు. ఆ సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పిస్టల్‌ చూపించి డబ్బులు డిమాండ్‌ చేశారు. తమ వద్ద డబ్బులు లేవని మహేశ్, అతడి స్నేహితులు చెబుతుండగానే స్కూటీ వెనుక కూర్చున్న వ్యక్తి.. మహేశ్‌ గొంతు, ఛాతీ, మెడపై కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు తగలడంతో మహేశ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు స్కూటీపై, మరొకరు మహేశ్‌ కారులో ముస్తాబాద్‌ రోడ్డు వైపునకు పారిపోయారు.

కొంతదూరం వెళ్లాక కారును అక్కడ వదిలేసి పరారయ్యారు. రక్తపుమడుగులో ఉన్న మహేశ్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు 3 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. హత్యకు కారణాలేంటో తెలుసుకునేందుకు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా