పెళ్లికి నిరాకరించిందని.. బీరు సీసాను పగులగొట్టి గాజు ముక్కతో..

17 Jul, 2022 04:16 IST|Sakshi
యువతి గొంతు కోసిన నిందితుడిని మీడియాకు చూపుతున్న ఎస్‌ఐ మహేష్‌ 

యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది 

నిజామాబాద్‌ జిల్లాలో ఘటన  

మోపాల్‌ (నిజామాబాద్‌ రూరల్‌): పెళ్లికి నిరాకరించిందని యువతి గొంతుకోసి హత్యాయత్నం చేశాడు ఓ ప్రేమోన్మాది. నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మోపాల్‌ మండలం చిన్నాపూర్‌కు చెందిన ఓ యువతికి, నిజామాబాద్‌ రూరల్‌ మండలం మానిక్‌భండార్‌కు చెందిన సుంకరి సంజయ్‌కుమార్‌కు మధ్య మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

బంధువుల ఇంట్లో ఫంక్షన్‌ సందర్భంగా సంజయ్‌కుమార్‌తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. కాగా, ఈనెల 14న తన పుట్టిన రోజు ఉందన్న సాకుతో యువతిని సంజయ్‌కుమార్‌ బలవంతంగా సమీప గ్రామంలోని సాయిబాబా ఆలయానికి తీసుకెళ్లాడు. తిరిగి గ్రామానికి తీసుకొచ్చే క్రమంలో నిర్మానుష్య ప్రాంతంలో రాత్రి సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని సంజయ్‌ కోరగా, యువతి నిరాకరించింది.

దీంతో అతను ఆమె గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి ఊపిరాడక స్పృహ కోల్పోగా, బీరు సీసాను పగులగొట్టి గాజు ముక్కతో పలుమార్లు గొంతుకోశాడు. అనంతరం ఆమె మృతిచెంది ఉంటుందని భావించి, సంజయ్‌ అక్కడినుంచి పారిపోయాడు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్తున్న వాహనదారులు ఆమెను గమనించి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆ యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాధితురాలి తండ్రి గతంలోనే చనిపోగా తల్లితో ఉంటోంది. సంజయ్‌కుమార్‌ తనపై అనుమానం పెంచుకోవడంతో బాధితురాలు కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెపై గతంలో పలుమార్లు దాడి చేశాడు. ఓ సారి ఇంటికి వెళ్లి యువతితోపాటు ఆమె తల్లిపైనా దాడిచేశాడు.

గత ఏడాది డిసెంబర్‌ 31న బాధితురాలిని అమ్రాబాద్‌ అటవీప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండతో మోదాడు. దీంతో స్పృహ తప్పి పడిపోయిన ఆమె మరుసటి రోజు అటుగా వెళ్తున్న వారి సహాయంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంది. అప్పుడే గ్రామస్తులు, కుటుంబీకులు సంజయ్‌ను మందలించారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పారిపోయిన సంజయ్‌ను 36 గంటల్లోనే పట్టుకున్నట్లు ఎస్‌ఐ మహేశ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు