పక్కింటి అమ్మాయిని చూశాడని..

1 Jan, 2021 08:59 IST|Sakshi
మృతదేహంతో ఆందోళనకు దిగిన నిరసనకారులు

మృతదేహంతో రోడ్డుపై ఆందోళన

సాక్షి, కనిగిరి: జరిగిన అవమానం తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక మంగలిమాన్యంలో గురువారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. కనిగిరి పట్టణం పాతూరు మంగలిమాన్యంలో నివాసం ఉంటున్న రామకృష్ణ (22) తన ఇంటి మిద్దెపై ఫోన్‌ మాట్లాడుకుంటున్నాడు. ఇంటి పక్కనే ఉన్న అమ్మాయిని చూశాడంటూ ఆ అమ్మాయి తల్లి ఇంటిపైకి వచ్చి దుర్బాషలాడింది. అంతేకాకుండా ఆమె అన్న..రామకృష్ణను జూనియర్‌ కాలేజీ వద్దకు తీసుకెళ్లి తన స్నేహితులతో కొట్టించాడు. అంతేకాకుండా చంపుతామని బెదిరించడంతో రామకృష్ణ అవమానంతో పాటు భయపడి గత నెల 12న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కందుకూరు, ఒంగోలు, గుంటూరు ఆస్పత్రిలకు తరలించారు. అయినా పరిస్థితి విషమించి డిసెంబర్‌ 29న రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. రామకృష్ణను అవమానించి అతడి మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలంటూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులకు ప్రజా సంఘాల ఐక్య వేదిక మద్దతు తెలిపింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రామిరెడ్డిలు వచ్చి ఆందోళనకారులకు సర్ది చెప్పారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మృతుడి కుటుంబ సభ్యులు చిన్న, కృష్ణ, ఓబయ్య, నారాయణ, నాగార్జున, అచ్చమ్మ, వరలక్ష్మి, ఐక్యవేదిక నాయకులు పీసీ కేశవరావు, వరలక్ష్మి, వెంకలక్ష్మి, మైమూన్, గురవయ్య, అశోక్‌ పాల్గొన్నారు. (చదవండి: భారీ కుంభకోణం: రూ.4,837 కోట్లు ఎగవేత)

మరిన్ని వార్తలు