అద్దెకుంటున్న యువకుడితో పరిచయం.. యువతికి ఫోన్‌ చేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ

2 Jun, 2022 17:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): యువతిని ప్రేమించి తనతో కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించిన యువకుడిపై భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భవానీపురానికి చెందిన యువతి నగరంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. ఆ యువతి కృష్ణలంకలో ఉంటున్న తన పెదనాన్న ఇంటికి వెళ్లగా, అక్కడ అద్దెకు ఉంటున్న అమిత్‌ పరిచయమయ్యాడు. అతని ద్వారా అయనవెల్లి రాజేష్‌ అనే యువకుడు పరిచయమయ్యాడు. గతేడాది అక్టోబర్‌లో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.
చదవండి: భర్త నిర్వాకం.. ప్రియురాలితో గుట్టుగా కాపురం.. భార్యకు తెలిసి..

ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ రాజేష్‌ యువతిని బెదిరించి డబ్బులు అడిగాడు. భయంతో ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. అయినప్పటికీ అతని బెదిరింపులు ఆగలేదు. ఈ క్రమంలో రూ.3లక్షల నగదు, రెండు బంగారు ఉంగరాలు ఇచ్చింది. ఇదంతా ఏడాది కాలంగా జరుగుతున్నా యువతి భయంతో ఎవరికీ చెప్పలేదు. గత ఏప్రిల్‌ 27న రాజేష్‌ ఆ యువతికి ఫోన్‌ చేసి ఫొటోలు పోస్టు చేస్తానంటూ మళ్లీ బెదిరించసాగాడు.

ఎవరికీ చెప్పుకోలేక భయపడి ఆమె స్కూటీతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఆస్పత్రి పాలైంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత ఆ యువతి రాజేష్‌ తన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించి డబ్బులు తీసుకున్నాడని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు