డోంట్‌ బీ ప్రాంక్‌..

4 May, 2022 08:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌, హిమాయత్‌నగర్‌: అది జడ్చర్ల బస్టాండ్‌. గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కొందరు యువకులు ప్రత్యక్షమై భిక్షాటన పేరిట ప్రయాణికులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించారు. డబ్బులు అడుక్కుంటూ మహిళల పాదాల  మీద పడ్డారు. వీరి ప్రవర్తన  శృతి మించడంతో ప్రయాణికుల్లో సహనం నశించి వారిని పట్టుకుని చితకబాదారు. దాంతో యువకులు ఇదంతా  ప్రాంక్‌ అని రహస్యంగా వీడియో చిత్రీకరణ చేస్తున్నామని వివరించారు. దీంతో మరింత అసహనానికి గురైన ప్రయాణికులు వారిని పోలీసులకు అప్పగించబోయారు. అయితే వారు కాళ్లావేళ్లా పడి బతిమాలాడడంతో వదిలేశారు.  

  • ఒకటి కాదు రెండూ కాదు ప్రాంక్‌ వీడియోల పేరిట పలువురు చెలరేగిపోతున్న సంఘటనలు నగరం చుట్టుపక్కల తరచు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్‌ హీరో ప్రాంక్‌ వీడియో సృష్టించిన వివాదంతో మరోసారి ఈ ప్రాంక్‌ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. .      

ప్రాంక్‌...యాక్‌... 

  • ఇలాంటి వీడియోలకు మంచి వ్యూస్‌ వస్తుండడంతో అనేక మంది యూ ట్యూబర్స్‌ ప్రాంక్‌ బాట పడుతున్నారు. వీరిలో కొందరు పరిధిలో ఉండి పెద్దగా ఇబ్బంది పెట్టని ప్రాంక్‌ వీడియోలు చేస్తుండగా మరికొందరు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. ఓ లేడీ యూట్యూబర్‌ తాను చేసే ఓ గేమ్‌షో కోసం జనాల మధ్య వీడియోస్‌ చేస్తుంది. మెట్రో రైలులో కింద కూర్చుని కర్చీఫ్‌ వేసుకుని అడుక్కోవడం  మొదలుకుని మెట్రో రైలులో వీరి టీమ్‌కు చెందిన అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం, ఇతరులను ముద్దు అడగడం వంటివీ  చేయిస్తోంది. 

ఫిర్యాదు చేస్తే చర్యలు... 
ప్రాంక్‌ వీడియోల పేరుతో పబ్లిక్‌ ప్రదేశాలు సహా ఎక్కడా అశ్లీలం, అభ్యంతరకరమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఇటీవల ఇలాంటి వీడియోలు యూట్యూబ్‌లోనూ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. ప్రాంక్స్‌ వల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు  ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వీటి ఆధారంగా కేసులు నమోదు చేసుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.  
– కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్‌ క్రై మ్‌ ఏసీపీ   

మరిన్ని వార్తలు