మరో మత్తు బీభత్సం

17 Dec, 2021 08:02 IST|Sakshi

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లో తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అదుపు తప్పిన వేగంతో దూసుకొస్తూ రోడ్డు ప్రమాదానికి కారకులైన యువకులు ఘటనా స్థలం నుంచి తప్పించుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజగుట్ట నాగార్జున సర్కిల్‌ వైపు నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3 మీదుగా ఐ20 (టీఎస్‌ 10 ఈపి 1877) కారులో ముగ్గురు యువకులు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వెళ్తూ అల్మండ్‌ హౌస్‌ వద్ద ఓ స్కూటరిస్ట్‌ను ఢీకొట్టారు. ఈ ధాటికి కారు ఆకాశంలో పల్టీలు కొట్టి డివైడర్‌ అవతలి వైపు పడింది.

అదే సమయంలో బంజారాహిల్స్‌ మసీదు వైపు నుంచి పంజగుట్ట వైపునకు వెళ్తున్న వింగర్‌ (టీఎస్‌ 12 యూసీ 2970) కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఐ20 కారుతో పాటు వింగర్‌ కూడా ముందు భాగం నుజ్జునుజ్జైంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మహ్మద్‌ ఆరిఫ్, ప్రణతి, దీక్ష, గ్లోరియా, సాయిలక్ష్మి, తేజస్విరెడ్డి, దుర్గా రాకేష్‌ ఉండగా, గణేశ్‌ కారు నడుపుతున్నాడు.

వీరంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అవతలి వైపు నుంచి కారు ఆకాశంలో పల్టీలు కొడుతూ ఇవతలి వైపు తాము వెళ్తున్న కారుకు అడ్డుగా వచ్చి ఢీకొట్టిందని దీంతో భయభ్రాంతులకు గురయ్యామని వింగర్‌ డ్రైవర్‌ గణేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కారకులైన ‘నిషా’చరులు అక్కడి నుంచి కారును వదిలేసి ఉడాయించారు. ఈ కారు ఎవరిదనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి కోసం గాలింపు చేపట్టారు.  

మరిన్ని వార్తలు