ప్రాణం మీదికి తెచ్చిన ఫేస్‌బుక్‌ ప్రేమ 

22 Dec, 2020 12:41 IST|Sakshi

 ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడని ఆత్మహత్య

మదనపల్లె టౌన్‌ : ఫేస్‌బుక్‌ ప్రేమ ఓ యువతి ప్రాణం మీదకు వచ్చింది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించి, మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డాడని ఆమె మనస్తాపం చెందింది. జీవితంపై విరక్తితో ఆత్మహతాయ్యత్నానికి పాల్పడింది. మదనపల్లె మండలంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. రూరల్‌ ఎస్‌ఐ దిలీప్‌కుమార్, బాధితురాలి కథనం మేరకు మండలంలోని ఓ రైతు కుమార్తె (20)కు మదనపల్లెలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదివే సమయంలో అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన వినోద్‌కుమార్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఏడాదిగా చాటింగ్‌ చేసుకుంటూ ప్రేమించుకున్నారు. కొంతకాలం సహజీవనం సాగించారు. పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ఇద్దరి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసింది.

అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని హెచ్చరించారు. అతని ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేశారు. దీంతో ఆ యువకుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో యువతికి తల్లిదండ్రులు దగ్గరి బంధువుతో పెళ్లి కుదిర్చారు. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక ప్రియుడికి ఫోన్‌ చేసింది. అతడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో మనోవేదనకు గురైన ఆ యువతి సోమవారం పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. రూరల్‌ ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

 మహిళపై సామూహిక అత్యాచారం ?
గుర్రంకొండ :  ఓ మహిళపై పది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. బాధితురాలు గాయాలతో బయటపడింది. గుర్రంకొండ గ్రామానికి సమీపంలో జీవనతోపునకు వెళ్లే మార్గంలో సిద్దేశ్వరగుట్ట పరిసరాల్లో ఈ అఘాయిత్యం జరిగినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు పది మంది యువకులు సిద్దేశ్వరస్వామి గుట్టలో ఓ పెద్ద బండరాయిపై ఉండడాన్ని పరిసర పొలాల రైతులు గమనించారు. మద్యం సేవించడానికి వారు అక్కడి వచ్చారేమోనని రైతులు భావించారు. అయితే రాత్రి 8.20 గంటలకు దాదాపు 30 సంవత్సరాల వయస్సున్న మహిళ గాయాలతో పరుగెత్తుకొంటూ సమీప కోళ్లఫారమ్‌ వద్దకు చేరుకుంది. అక్కడ పనిచేసే వ్యక్తులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనను 10 మంది యువకులు వెంబండించి అఘాయిత్యానికి పాల్పడ్డారని , వారి నుంచి తప్పించుకుని వచ్చానని భోరున ఏడ్చినట్లు ప్రత్యక్ష్య సాక్షులు పేర్కొన్నారు. ఆమెను కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడ్డా రా లేక, అటు వైపు వెళుతుంటే బలవంతంగా లాక్కెల్లారా అనే విషయం పోలీసుల విచారణలో తేలాలి. ఈ విషయమై ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ను వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఆయన పేర్కొన్నారు.     

>
మరిన్ని వార్తలు