పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య

23 Aug, 2022 09:19 IST|Sakshi

(నెల్లూరు) ఉలవపాడు: ప్రేమించిన అబ్బాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండల కేంద్రమైన ఉలవపాడులో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉలవపాడుకు చెందిన కుంచాల భార్గవి (19) దర్గా సెంటర్‌లో నివాసం ఉంటోంది. అదే కాలనీకి చెందిన మాల్యాద్రి, భార్గవి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తర్వాత మాల్యాద్రి పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాడు. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, బలవంత పెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో యువతి లేఖ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తర్వాత కుటుంబసభ్యులు గుర్తించారు.

ఎమ్మెల్యే దృష్టికి..
ఈనెల 10వ తేదీన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి భార్గవి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో యువతి సమస్యను తెలియజేసింది. పోలీసులు పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరింది. వెంటనే ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఏఎస్సై సుబ్బారావును పిలిచి నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇంతలోనే యువతి ఆత్మహత్య చేసుకుంది. 

మరిన్ని వార్తలు