ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా దగ్గరై.. యువతి అన్నయ్యకు అశ్లీల చిత్రాలు పంపి..

7 Nov, 2021 08:27 IST|Sakshi
పోస్టుమార్టాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ బాలరాజు, ఇతర అధికారులు

నమ్మించి.. నయవంచన!

పరువు పోతుందని యువతి ఆత్మహత్య

ఆలస్యంగా వెలుగులోకి.. 

తండ్రి ఫిర్యాదుతో యంత్రాంగం అప్రమత్తం

మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం

రేగిడి(శ్రీకాకుళం జిల్లా): ప్రేమ పేరుతో నయ వంచనకు పాల్పడ్డాడు.. యువతితో కలిసి ఉన్న అశ్లీల చిత్రాలను ఆమె కుటుంబ సభ్యులకే పంపాడు.. మంచి, చెడులు మరచి చేసిన ఈ పాడు పని ఆ యువతి పాలిట మృత్యు శాసనమైంది. అశ్లీల చిత్రాలు బయటపడితే పరువుపోతుందని భావించిన ఆ యువతి ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.  తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటానని ఆశించిన ఆమె అర్ధాంతరంగానే తనువు చాలించి కుటుంబానికి తీవ్ర శోకాన్ని మిగిల్చింది.

చదవండి: Heavy Rains: మరో ఐదు రోజులు కుండ పోతే! 

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం..  కొత్తచెలికానివలస గ్రామానికి చెందిన యువతి రాకోటి పగడాలమ్మ (19) గత నెల 30వ తేదీన ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. మృతికి గల కారణాలు తెలియక తల్లిదండ్రులు ఆమెకు అంత్యక్రియలు కూడా నిర్వహించేశారు. అంతా సవ్యంగా ఉందన్న సమయంలో పొరుగు గ్రామైన రంగారాయపురానికి చెందిన డి.హరీష్‌ యువతి అన్నయ్యకు పంపిన అశ్లీల చిత్రాలు సంచలనం సృష్టించాయి. తన కుమార్తె మృతికి కారణం యువకుడు హరీషేనని, ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా దగ్గరై లొంగదీసుకొని నయవంచనకు పాల్పడ్డాడని  తండ్రి రాకోటి రామారావు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పొందుపరచారు. వీటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

చదవండి: భార్య వివాహేతర సంబంధం.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. 12 గంటల్లోనే

మృతదేహాన్ని వెలికి తీసి..పోస్టుమార్టం  
పగడాలమ్మ మృతదేహాన్ని నాగావళి నదీ తీరంలో కుటుంబ సభ్యులు పూడ్చి పెట్టారు. శనివారం శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ కె.బాలరాజు, పాలకొండ సీఐ శంకరరావు, తహసీల్దార్‌ బి.సత్యం, ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ ఆలీ సమక్షంలో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించి రాజాం సామాజిక ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ వేణుగోపాల్‌ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా ఇంకా విచారణ జరుపుతున్నామని, త్వరలో అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు