ప్రేమికుడి ఇంటి పైనుంచి దూకి..

31 Jul, 2020 06:32 IST|Sakshi
తేజ ఇంటి ముందు విగతజీవిగా వైష్ణవి   

పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడిన అబల

ప్రేమికుడి ఇంటి పైనుంచి దూకి తనువు చాలించిన వైనం  

పెందుర్తి: ఇద్దరికీ ఒకే చోట కొలువు... మనసులు కలిశాయి... జీవితాంతం కలిసే జీవిద్దామని నిర్ణయం కూడా తీసుకున్నారు... కొద్దిరోజుల తర్వాత మనసిచ్చిన వాడితోపాటు అతడి తల్లిదండ్రులూ ప్లేట్‌ ఫిరాయించారు. దీంతో ఇంటికి వచ్చి నిలదీసినా ఫలితం శూన్యం.. చేసేది లేక ఆ అబల తనువు చాలించింది. పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలో ఓ యువతి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చినముషిడివాడలో నివాసం ఉంటున్న షణ్ముఖ తేజ, ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతానికి చెందిన కావేటి వైష్ణవి(22) నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే వీరి పెళ్లికి తేజ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అతడు వైష్ణవికి మొహం చాటేశాడు. ఈ క్రమంలో గురువారం తేజ ఇంటికి వచ్చిన వైష్ణవి పెళ్లి విషయమై అతడి తల్లిదండ్రులతో చర్చించింది. వారు ససేమిరా అనడంతో తేజ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తు పైనుంచి వైష్ణవి దూకేసింది. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. క్రైం డీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ స్వరూపారాణి, సీఐ కె.అశోక్‌కుమార్‌ ప్రాథమిక విచారణ చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టినట్లు సీఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా