ఇంట్లో తల్లిదండ్రుల సమక్షంలోనే తాళి కట్టి.. ఆపై..

30 Mar, 2022 15:52 IST|Sakshi

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.. నెల్లూరులోని చంద్రమౌళి నగర్‌కు చెందిన సుకృత (23) అదే ప్రాంతానికి చెందిన ఉదయబాబీ ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం ఉదయబాబీ తన ఇంట్లోనే తల్లిదండ్రుల సమక్షంలో సుకృతకు పసుపుతాడు కట్టాడు. అప్పటినుంచి వారు అదే ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. కొంతకాలం అన్యోన్యంగా ఉన్నారు. అనంతరం ఉదయబాబీ అతని కుటుంబసభ్యులు ఆమెను కులం పేరుతో దూషిచడంతోపాటు మానసికంగా, శారీరకంగా హింసించసాగారు.

ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీన ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఉదయబాబీ ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం జయభారత్‌ హాస్పిటల్‌కు తరలించాడు. సుకృత అనారోగ్యంగా ఉందని ఆమె సోదరికి సమాచారం అందించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు చెన్నై అపోలో హాస్పిటల్‌కు, తర్వాత మరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈనె 27వ తేదీన అర్ధరాత్రి మృతిచెందారు. ఈమేరకు బాధితురాలి కుటుంబసభ్యులు సోమవారం రాత్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉదయబాబీ అతని కుటుంబసభ్యులపై వరకట్న వేధింపులు, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

చదవండి: (బావ వరసయ్యే వ్యక్తితో ప్రేమ.. గర్భం దాల్చిన ఇంటర్‌ విద్యార్థిని)

అనారోగ్యంతో..
అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం అర్ధరాత్రి నెల్లూరులోని నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షిర్డీ సాయినగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం కొత్త హరిజనవాడకు చెందిన ఎ.ఆనందకుమార్, స్రవంతి (30) దంపతులు కొంతకాలంగా నవాబుపేట షిర్డీ సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. స్రవంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి ఆమె తన ఇంట్లోని సీలింగ్‌ ఐరన్‌ రాడ్‌కు చీరతో ఉరేసుకున్నారు. మృతురాలి తల్లి రమణమ్మ మంగళవారం తెల్లవారుజామున చూసి నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బి.రమేష్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు