అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య

23 Aug, 2021 01:51 IST|Sakshi
మమత (ఫైల్‌)

సంగారెడ్డి:రాఖీ పండుగ వేడుకలు దేశమంతటా ఘనంగా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సోదరసోదరీమణుల సందడితో అన్నీ ఇళ్లూ కళకళలాడుతుంటాయి.తమ సోదరులకు రాఖీ కట్టి ప్రేమను చాటుకుంటున్నారు అక్కాచెల్లెళ్లు. కానీ ఇదే రాఖీ పండగ రోజు ఆ ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. అందరిలానే ఆమె కూడా తన అన్నకు రాఖీ కట్టాలనుకుంది. 

ఆదివారం రాఖీ పండగ కావడంతో అందరు చెల్లెళ్ల మాదిరే మమత అనే యువతి కూడా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లింది. కానీ ఆ యువతి చేత రాఖీ కట్టించుకునేందుకు తన అన్నయ్య రమేశ్ నిరాకరించాడు. కారణమేంటో తెలియదు గానీ తాను రాఖీ మాత్రం కట్టించుకోనని స్పష్టం చేశాడు. అన్నపై ఎంతో ప్రేమతో రాఖీ తీసుకొచ్చిన మమత తన అన్నయ్య ఆ మాట అనగానే కన్నీళ్లు పెట్టుకుంది. 

అయితే ఇంటికి వచ్చిన పెద్ద సోదరి సరితతో రమేశ్‌ రాఖీ కట్టించుకున్నాడు. తన అక్కతో అన్నయ్య రాఖీ కట్టించుకుని తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపానికి గురైన మమతను తండ్రి ఓదార్చి పొలానికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మమత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి వచ్చిన బసన్నకు కూతురు శవమై కనిపించడంతో బోరున విలపించాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. జహీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ శ్రీకాంత్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

జహీరాబాద్‌ ఎస్‌ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారెడ్డి నగర్‌ కాలనీలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న బసన్న(బస్వరాజ్‌)కు నలుగురు సంతానం. భార్య చనిపోయింది. పెద్ద కూతరుకు పెళ్లయింది. పెద్ద కుమారుడు కూడా వేరుగా నివసిస్తున్నాడు. బసన్నతో పాటు చిన్న కొడుకు రమేశ్, చిన్న కూతురు మమత(22)లు ఉంటున్నారు. నాలుగైదు రోజులుగా అన్నాచెల్లెళ్ల మధ్య గొడవల కారణంగా మమతతో రమేశ్‌ మాట్లాడటం లేదని తెలిపారు. 

అయితే స్థానికులు మాత్రం మమత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ  కట్టించుకోనంత మాత్రన ఇలా ఆత్మహత్య చేసుకుంటారా అని సందేహపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు