మూడ నమ్మకంతో తనను తానే బలిచ్చుకున్న యువతి

20 Aug, 2021 01:39 IST|Sakshi

లక్నో: సాధారణంగా గ్రామ దేవతలకు కోళ్లను, పొట్టేళ్లను బలివ్వడం చూస్తుంటాం. కానీ ఓ యువతి ఏకంగా తనను తానే బలిచ్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో కలకలం రేపింది. ఇక ఈ సంఘటనపై  పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మీరట్ జిల్లా ఖర్‌ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామానికి సమీపంలోని అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని నిత్యం ఎంతో ఇష్టంగా అత్యంత భక్తి శ్రద్దలతో పూజించేది. 

భక్తి పారవశ్యంతో కాళీమాత ఆలయానికి ప్రతి రోజూ వెళ్లేది. అయితే ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఆ యువతి తనను తాను కాళీమాత కుమార్తెగా భావించడం మొదలు పెట్టింది. తాను మహా భద్రకాళి కూతురునని అమ్మవారి కోసం తన ప్రాణం త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఇదే క్రమంలో ఆ యువతి ఒంటరిగా తెల్లవారు జామున ఆలయానికి వెళ్లింది. అటవీ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేరు. ప్రతి రోజూ పూజారి కూడా సాయంత్రం వచ్చి అమ్మవారికి పూజ చేసి వెళ్లిపోయేవాడు.

అయితే ఆ యువతి చాలాసేపు పూజ చేసిన తరువాత ఊహించని నిర్ణయం తీసుకుంది. తొలుత గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది. గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది. అయితే రోజూలానే ఆ రోజు సాయంత్రం ఆలయ పూజారి వచ్చి చూసేసరికి ఆ యువతి గుడి గంటలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. దీనితో ఆ పూజారి షాక్‌కు గురయ్యాడు. కొంతసేపటికి తేరుకుని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ యువతి మూఢ విశ్వాసాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానీ ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ గ్రామంలోని కొందరు ఆ యువతి మూఢ నమ్మకాల కారణంగానే తనను తాను బలిచ్చుకుందని అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం కుటుంబ సమస్యల వల్లే ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నారు. ఏ విషయంలోనో అదే రోజు కుటుంబ సభ్యులకు, ఆ యువతికి మధ్య వాగ్వాదం జరిగడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆలయానికి వెళ్లి ఉరేసుకుని వుండొచ‍్చని మరికొందరు అంటున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున‍్న పోలీసులు యువతి మృతికి అసలు కారణమేంటో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు