దైవ దర్శనానికి వెళుతూ..!!

24 Oct, 2021 04:08 IST|Sakshi
వరదనీటిలో మునిగిపోయిన వాహనం (ఇన్‌సెట్‌లో) సంధ్య (ఫైల్‌)

వర్షపు నీటిలో చిక్కుకున్న వాహనం.. యువతి మృతి

ఏడుగురిని కాపాడిన పోలీసులు

తిరుపతిలో ఘటన  

తిరుపతి క్రైం (చిత్తూరు జిల్లా): శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చిన కర్ణాటక బృందం ప్రయాణిస్తున్న వాహనం నీట మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది భక్తుల్లో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శనివారం తెల్లవారు జామున సుమారు ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది.

ఎస్వీ యూనివర్సిటీ పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం, రాయచూరు ప్రాంతం, ముదిగళ్‌కు చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనార్థం శనివారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. అప్పటికే పట్టణంలో భారీ వర్షం కురుస్తోంది. బాలాజీ కాలనీ నుంచి ఎమ్మార్‌పల్లి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి వద్ద ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ కింద ఏడడుగులు మేర వర్షపునీరు నిలిచిపోయింది.

ఆ దారి గురించి అవగాహన లేని డ్రైవర్‌ వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వాహనం వేగంగా వెళ్లి నీటి మధ్యలో ఆగిపోయింది. డోర్లు తెరుచుకోకపోవడంతో అందులో ఉన్న భక్తులు నీటిలో చిక్కుకున్నారు. హాహాకారాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న కుటుంబ సభ్యులను ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు.

వాహనం పూర్తిగా నీట మునిగిపోవడంతో సంధ్య(30) అనే మహిళ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒక చిన్నారి ఉంది. మృతురాలికి నాలుగు నెలల క్రితమే వివాహమైనట్టు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు