పొలానికి వెళ్లి.. శవమైంది

19 Aug, 2020 11:40 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటరామయ్య, ట్రైనీ డీఎస్పీ భవ్యకిషోర్‌

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి 

గోనెగండ్ల: పొలానికి వెళ్లిన ఓ యువతి ఇంటికి చేరకుండానే శవమైంది. కంపచెట్లలో విగతజీవిగా పడి ఉండటం చూసి,  సోదరులు, తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని ఎర్రబాడు గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఉసేన్‌సాహెబ్, బేగంబీలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. అందులో భాగంగా సోమవారం కుటుంబ సభ్యులందరూ పొలానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు.

అయితే కాస్త ముందుగా బయలుదేరిన చిన్న కూతురు హజరాబీ(23) ఇంటికి చేరలేదు. కంగారు పడిన సోదరులు దగ్గరి బంధువు ఉదూద్‌బాషాతో కలిసి పొలానికి వెళ్లి గాలించారు. కాస్త దూరంలో కంప చెట్లలో అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా పడి ఉండటం చూసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న కర్నూలు డీఎస్పీ వెంకటరామయ్య, ట్రైనీ డీఎస్పీ భవ్యకిషోర్, కోడుమూరు సీఐ పార్థసారథి రెడ్డి, గోనెగండ్ల ఎస్‌ఐ హనుమంతరెడ్డి మంగళవారం ఉదయం గ్రామానికి వెళ్లి విచారించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌ స్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతురాలి సోదరుడు దూద్‌వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హనుమంతరెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు