మిస్టరీగా వందన మృతి.. సందీప్‌ ఇంట్లో ఏం జరిగింది..?

19 May, 2022 09:27 IST|Sakshi
వందన (ఫైల్‌ఫోటో)

శ్రీకాళహస్తి: అనుమానాస్పద స్థితిలో యువతి మృతిచెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటుచేసుకుంది. టూ టౌన్‌ సీఐ భాస్కర్‌నాయక్‌ కథనం మేరకు.. శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలుకు చెందిన వందన (20) తొట్టంబేడు మండలం పొయ్యగ్రామంలో మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌గా పనిచేస్తోంది. పట్టణంలోని కుమ్మరివీధికి చెందిన పులి సందీప్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు బావమరదళ్లు కావడంతో త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

ఈ క్రమంలో వందన బుధవారం ఉద్యోగానికి వెళ్లే ముందు సందీప్‌ ఇంటికి వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో కానీ కాసేపటికి హాల్‌లో సందీప్‌ నిద్రిస్తుండగా బాత్‌రూమ్‌లో వందన ఉరివేసుకుని మృతి చెందింది. భయాందోళనకు గురైన సందీప్‌ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విషయం చెప్పాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భాస్కర్‌నాయక్, ఎస్‌ఐ మహేష్‌ మృతదేహాన్ని పరిశీలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా  కేసు నమోదు చేశారు.

ఎవరికీ చెప్పకుండా యువతి ఎందుకు సందీప్‌ ఇంటికి వెళ్లింది? వాళింట్లో ఏం జరిగిందో మిస్టరీగా మారింది. దీనిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీఐ భాస్కర్‌నాయక్‌ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం బంధువులకు అప్పగించారు.  

చదవండి: (ఆరేళ్లక్రితం వివాహం.. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి)  

మరిన్ని వార్తలు