యువతిపై అత్యాచారం, హత్య.. కట్టెల కోసమని అడవిలోకి వెళ్లగా..

4 Jan, 2022 14:28 IST|Sakshi
సుభద్ర మృతదేహం వద్ద గుమిగూడిన గ్రామస్తులు 

ఒరిస్సా(జయపురం): బొరిగుమ్మ సమితి చలానగుడ గ్రామ సమీపంలోని నీలగిరి అడవిలో 19 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు. ఆమెపై అత్యాచారం జరిపి, ఆపై హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలు చిలిగుడ గ్రామానికి చెందిన సుభద్ర అమనాత్య(19)గా గుర్తించినట్లు బొరిగుమ్మ సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారి హరికృష్ణ మఝి తెలిపారు. సుభద్ర అమనాత్య డిసెంబరు 30న ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు గాలించారు. జాడ తెలియరాలేదు.

చదవండి: (బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..)

సోమవారం ఉదయం చిలిగుడ గ్రామ మహిళలు కట్టెల కోసమని నీలగిరి అడవిలోకి వెళ్లగా, సగం కాలిన సుభద్ర అమనాత్య మృతదేహం కనిపించింది. బొరిగుమ్మ పోలీసు అధికారి ఖురేశ్వర సాహుకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసు డాగ్, సైంటిఫిక్‌ టీమ్‌లు చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. సుభద్రను దుండగులు హత్యచేసి నీలగిరి తోటలో పడేసినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని హరికృష్ణ మఝి వెల్లడించారు. దుండగులను పట్టుకున్నాకనే ఆమెపై అత్యాచారం జరిగిందా, ఎందుకు హత్య చేశారనే విషయాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు బలరాం అమనాత్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు