వివాహేతర సంబంధం: అద్దెకు ఉంటున్న యువకుడితో...

2 May, 2022 19:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శంషాబాద్‌ రూరల్‌: ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలియడంతో అతను నేరుగా కోర్టులో లొంగిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆదివారం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. సీఐ శ్రీధర్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సాతంరాయి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంట్లో బీహార్‌కు చెందిన రాహుల్‌ అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు సదరు మహిళ ఇంటిని ఖాళీ చేసి తొండుపల్లికి మకాం మార్చింది. ఈ సందర్భంగా ఆమెకు బీహార్‌కు చెందిన రేణు అలియాస్‌ రాను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే సాతంరాయిలో ఉంటున్న రాహుల్‌ తరచూ తొండుపల్లి వచ్చి సదరు మహిళను కలవడంతో పాటు ఫోన్‌లో మాట్లాడేవాడు. దీనిని గమనించిన రేణు తొండుపల్లి వచ్చిన అతడితో గొడవపడ్డాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని ఇద్దరిని హెచ్చరించి పంపించారు. గత ఏడాది డిసెంబర్‌ తొండుపల్లికి వచ్చిన రాహుల్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీనిని గుర్తించిన రేణు అతడిని వెంబడించి వెనక నుంచి రాయితో తలపై గట్టిగా కొట్టడంతో ట్రాక్‌ మధ్యలో బోర్ల పడిపోయాడు. రాహుల్‌ చనిపోయినట్లు గుర్తించిన రేణు బీహార్‌కు పారిపోయాడు.  

కేసు మార్పిడితో.. 
అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.గత నెల ఈ కేసును రైల్వే పోలీసులు శంషాబాద్‌ పీఎస్‌కు బదిలీ చేయడంతో  దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రేణు కోసం  బీహార్‌ వెళ్లగా అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్టు చేస్తారని భావించిన రేణు ఏప్రిల్‌ 25న రాజేంద్రనగర్‌ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో రేణును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. ఆదివారం సంఘటనా స్థలం వద్ద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. 

మరిన్ని వార్తలు