పెళ్లి చేయలేదని.. రాత్రి ఇంటికి వెళ్లి..

11 May, 2022 07:43 IST|Sakshi

సాక్షి, చెన్నై: వివాహం చేయలేదనే కోపంతో తండ్రిని హత్య చేసిన తనయుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా పాలయంకోట కీల్‌పాది ప్రాంతానికి చెందిన వ్యక్తి లూర్థుస్వామి(60). అతనికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఇతని పెద్దకుమారుడు జాన్సన్‌ (39) చదువుకోలేదు. మిగిలిన ఇద్దరు కుమారులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడిన జాన్సన్‌ రోజూ తల్లి, తండ్రి వద్ద తనకు వివాహం చేయమని గొడవ చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి కూడా తండ్రితో ఘర్షణకు దిగి.. బండరాయితో మోది చంపేశాడు. చోళత్తరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు జాన్సన్‌ కోసం గాలిస్తున్నారు.  

మరో ఘటనలో..
ప్రాణం తీసిన ఫ్లెక్సీ
చెన్నై: విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మరణించారు. మంగళవారం తిరుచ్చి సమీ పంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. తిరుచ్చి టోల్‌ గేట్‌ సమీపంలోని మేనకా నగర్‌లో ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది.  ఇక్కడ ప్లాట్‌ల అమ్మకాలు, అద్దెకు సంబంధించిన ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇక్కడ తెన్నకరైకు చెందిన షేట్‌(30), విమల్‌(28), లాల్గుడికి చెందిన చెల్లదురై(45) పనిచేస్తున్నారు. మంగళవారం  ఈదురు గాలులకు ఫ్లెక్సీ నేలకొరిగింది. దీంతో దాన్ని తొలగించి మరో చోట నిలబెట్టేందుకు ఈ ముగ్గురూ సిద్ధమయ్యారు. ఈ సమయంలో  ఫ్లెక్సీ ఓవైపుగా ఒరిగి పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దీంతో విద్యుదాఘాతం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలోనే షేట్, చెల్లదురై మరణించారు. విమల్‌ గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. 

చదవండి: పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి పంపించని భర్త.. దీంతో భార్య..

మరిన్ని వార్తలు