మాట్లాడదామని తీసుకెళ్లి గొంతుకోశారు.. 

4 May, 2021 09:48 IST|Sakshi

సాక్షి,బళ్లారి(కర్ణాటక): మాట్లాడే పని ఉందని చెప్పి ఇంటివద్ద ఉన్న యువకుడిని స్నేహితులు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి హత్య చేసిన ఘటన బళ్లారి నగరంలో ఆదివారం రాత్రి కలకలం సృష్టించించింది. వివరాలు... బ్రూస్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని మిల్లర్‌పేట సమీపంలో ఇస్మాయిల్‌(19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను జీన్స్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు యువకులు ఇంటివద్దకు వచ్చి ఇస్మాయిల్‌ను వెంట తీసుకెళ్లారు. వచ్చింది స్నేహితులే కదా అని ఇంట్లోవాళ్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు.  

కణేకల్లు బస్టాండ్‌ వద్ద వాగ్వాదం.. 
ఇస్మాయిల్‌ను వెంట తీసుకెళ్లిన నలుగురు యువకులు కణేకల్లు బస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇస్మాయిల్‌తో వాగ్వాదానికి దిగి గొడవ పడ్డారు. అనంతరం కత్తితో గొంతుకోసి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఇస్మాయిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వచ్చి రక్తపు మడుగులో విగతజీవిగా మారిన ఇస్మాయిల్‌ను చూసి రోదించారు. బ్రూస్‌పేట పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలించి ఒకరిని అరెస్ట్‌ చేశారు.  

భర్త చేతిలో భార్య హతం.. 
అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే చంపిన భర్త ఉదంతమిది. బళ్లారి నగరంలోని తాళూరు రోడ్డులో మస్తాన్‌రెడ్డి, ధనలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భార్యపై అతను కొంతకాలంగా  అనుమానం పెంచుకున్నాడు. తనకు అనారోగ్యంగా ఉందని, కోవిడ్‌ పరీక్షలు చేయించుకుందామని చెప్పి ఆదివారం రాత్రి భార్యను  కువెంపునగర్‌ సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ తలపై బండరాయి వేసి హత్యచేశాడు. అనంతరం  కౌల్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు