ముగ్గురు యువకులు.. మాటలతో మాయ చేసి..

21 Jul, 2021 09:39 IST|Sakshi

 రుణం పేరుతో నగర వాసికి కుచ్చుటోపీ

ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్‌

లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయి నేరాల బాట

మోసాల కోసమే 10 బ్యాంకు ఖాతాల సృష్టి

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ మొదటి వేవ్‌ ప్రభావంతో అమలైన లాక్‌డౌన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు యువకులు నేరబాట పట్టారు. రుణాల పేరుతో ఎర వేసి డబ్బులు స్వాహా చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన బాధితుడి ఫిర్యాదుతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పర్యవేక్షణలో దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి ఈ త్రయాన్ని అరెస్టు చేసి మంగళవారం నగరానికి తీసుకువచ్చారు. 

కాల్‌సెంటర్‌లో పని చేసి..
► ఢిల్లీకి చెందిన విజయ్‌ ధావన్, కపిల్‌ ఠాకూర్, అభయ్‌ వర్మ డిగ్రీలు పూర్తి చేసి అక్కడి ఓ కాల్‌ సెంటర్‌లో టెలీ కాలర్లుగా పని చేశారు. స్నేహితులుగా మారిన ఈ ముగ్గురు గతేడాది లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. దీంతో సైబర్‌ నేరాలు చేయాలని నిర్ణయించుకున్న వీరు తమకు తెలిసిన టెలీ కాలింగ్‌ విధానాన్నే ఎంచుకుని రంగంలోకి దిగారు. బోగస్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి అవసరమైన డబ్బు కూడా లేకపోవడంతో అవివాహితుడైన విజయ్‌ ఇంట్లోనే సెట్‌ చేసింది. అక్కడ నుంచి దేశ వ్యాప్తంగా పలువురికి కాల్స్‌ చేస్తూ బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రతినిధులుగా చెప్పుకొన్నారు. 

► సికింద్రాబాద్‌ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి వీరి వలలో పడ్డాడు. ఇతడికి ఫోన్‌ చేసిన కేటుగాళ్లు తక్కువ వడ్డీకి రూ.10 లక్షల రుణం ఇస్తామంటూ ఎర వేశారు.  రుణం దరఖాస్తు కోసమంటూ బాధితుడి నుంచి కొన్ని గుర్తింపు పత్రాలు వాట్సాప్‌ ద్వారా సేకరించారు. ఆపై రుణం మంజూరైందని చెబుతూ.. కొన్ని చార్జీలు చెల్లించాలంటూ అతడి వద్ద నుంచి డబ్బు వసూలు చేశారు. లోన్‌ మొత్తం బ్యాంకు ఖాతాలో పడాలంటే ముందుగా మూడు కిస్తీలు అడ్వాన్స్‌గా చెల్లించాలని మరికొంత గుంజారు. చెల్లిస్తున్న చార్జీల్లో కొన్ని రిఫండ్‌ వస్తాయంటూ చెప్పడంతో సికింద్రాబాద్‌ వాసి డబ్బు చెల్లిస్తూ పోయారు.  

► ఇలా రూ.9,44,351 చెల్లించినా తన ఖాతాలో డబ్బు పడకపోవడం, మరికొంత చెల్లించాలంటూ సైబర్‌ నేరగాళ్లు కోరడంతో బాధితుడు అనుమానించారు. ఈ ఏడాది జూన్‌లో సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారుల సాంకేతిక ఆధారాలతో నిందితులు ఢిల్లీలో ఉన్న ట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ముగ్గురినీ అరెస్టు చేసింది.  వీరి నుంచి రూ.2 లక్షల నగదు, 8 సెల్‌ఫోన్లు, మోసాలు చేయడానికే తెరిచిన పది బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పాస్‌బుక్స్, చెక్‌బుక్స్‌ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణలో వీళ్లు ఎంత మందిని మోసం చేశారో తెలుసుకోనున్నారు. 


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు