డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు.. మనస్తాపంతో...

25 Mar, 2022 08:16 IST|Sakshi

దస్తురాబాద్‌(ఖానాపూర్‌): డ్రంకెన్‌డ్రైవ్‌ కేసు నమోదుతో మనస్తాపం చెందిన ఆదివాసీ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని గొడిసిర్యాల గోండుగూడాలో చోటు చేసుకుంది.

మృతుడి కుటుంబ సభ్యులు, నిర్మల్‌ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాడవి నాగరాజు (19) ఈనెల 13న జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలం చిత్రవేణిగూడంలో ఓ వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మద్యం తాగాడు. వెంటనే బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో స్థానిక ఎస్సై జ్యోతిమణి వాహనాల తనిఖీ చేపట్టారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో నాగరాజు మద్యం తాగినట్లు రుజువైంది. పోలీసులు బైక్‌ను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం నాగరాజు ఇంటికి చేరగా తల్లిదండ్రులు బైక్‌ ఏమైందని ప్రశ్నించారు. పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుకున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో వారు కోపం చేయడంతో అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని జన్నారం ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.  

మృతదేహంతో రోడ్డుపై ఆందోళన
పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేయడంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురువారం ఉదయం మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ధర్నా చేపట్టేందుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్‌ సీఐ అజయ్‌బాబు సిబ్బందితో గ్రామ పొలిమేరకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. సుమారు ఐదు గంటల పాటు ఆందోళన కొనసాగించగా.. డీఎస్పీ ఉపేంద్రరెడ్డి అక్కడికి చేరుకుని ఆదివాసీ నాయకులతో చర్చించారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తలు