‘తపాడియా’ దారుణ హత్య.. సీఎం సంచలన నిర్ణయం

11 May, 2022 16:28 IST|Sakshi

రాజస్తాన్‌లో రోజురోజుకు ఉద్రిక్తర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భిల్వారాలో ఓ వర్గానికి చెందిన యువకుడిని మరో వర్గానికి చెందినవారు దారుణ చంపడంతో ఆ ప్రాంతంలో టెన్షన్‌ నెలకొంది. దీంతో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాం‍తంలో ఇంటర్నెట్‌ సేవలను గురువారం ఉదయం వరకు నిలిపివేశారు. 

వివరాల ప్రకారం... భిల్వారాకు చెందిన ఆదర్శ్‌ తపాడియా(22)ను ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి కత్తితో పొడిచి చంపారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తపాడియాను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తపాడియాను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో భిల్వారాలో పోలీసు బలగాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

తపాడియా మృతి కారణంగా ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత చర్యల్లో భాగంగా రాజస్తాన్‌ ప్రభుత్వం భిల్వారాలో గురువారం ఉదయం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈద్ పండుగ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్ స్వస్థలమైన జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 

ఇది కూడా చదవండి: నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్‌ కొన్న సురేష్‌రెడ్డి!

మరిన్ని వార్తలు