సీబీఐ మరో కట్టుకథ: చంపుతుంటే.. పడుకున్నాడు! 

26 Feb, 2022 08:13 IST|Sakshi

వివేకా హత్యకు గురైనట్లు తెలిసినా రాత్రంతా కునుకు తీసిన రంగయ్య

వాచ్‌మెన్‌ స్టేట్‌మెంట్‌ పేరిట సీబీఐ మరో కట్టుకథ

సాక్షి, అమరావతి: కళ్లెదుట హత్య జరుగుతోందని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు?.. అడ్డుకోడానికి ప్రయత్నిస్తారు లేదా కనీసం నలుగురిని పోగేసి అప్రమత్తం చేస్తారు. కానీ యజమాని హత్యకు గురవుతున్నట్లు తెలిసినా కిటికీలోంచి చూసి ఏమీ పట్టనట్లుగా వెళ్లిపోయి రాత్రంతా హాయిగా నిద్రపోవడం మానవమాత్రుడికి సాధ్యమేనా..? మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వాచ్‌మెన్‌ రంగయ్యతో సీబీఐ ఇప్పించిన స్టేట్‌మెంట్‌ అచ్చం ఇలాగే ఉంది.

చదవండి: దస్తగిరి చెప్పిందంతా అబద్ధం

చిలక పలుకులే..
తనకు కళ్లు సరిగా కనిపించవని... ఏదీ పెద్దగా వినిపించదని గతంలో సిట్‌ దర్యాప్తు బృందాలకు చెప్పిన రంగయ్య రెండేళ్ల తర్వాత హత్య జరిగిన రోజు రాత్రి విషయాల గురించి పూస గుచ్చినట్లు చెప్పడం చిలక పలుకులను గుర్తు చేస్తోంది.

ఇంతకీ రంగయ్యకు ఏం గుర్తొచ్చిందంటే..
2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో నుంచి బాధతో పెద్దగా అరిచిన అరుపులు వినిపించాయి. అవి విని రంగయ్య కిటికీలోకి తొంగి చూశాడట. కిటికీ అద్దం ఒకటి తెరచి ఉందని, కర్టెన్‌ కొంత పక్కకు జరిగి ఉందని చెప్పాడు. ఆ చిన్న సందులోంచి లోపలికి చూస్తే ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, దస్తగిరితోపాటు మరొకరు హాలులో అటూ ఇటూ తచ్చాడుతూ కనిపించారట. తరువాత కాసేపటికి మిగిలిన ముగ్గురు పారిపోగా... ఆదరబాదరగా వచ్చిన ఎర్ర గంగిరెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నిస్తే ‘నీకెందుకు...? ఎవరికైనా చెబితే నిన్నూ నరికి పారేస్తా..’ అని హెచ్చరించాడట. ఇదీ క్లుప్తంగా రంగయ్య చెబుతోంది.

రంగయ్య కథనం నమ్మశక్యమేనా?
పెరటి తలుపు ముందుగానే తీసి ఉంచి రాత్రి లోపలికి ప్రవేశించిన హంతకులు కిటికీ తలుపు వేయలేదనడం, కర్టెన్‌ కొద్దిగా పక్కకు జరిగి ఉన్నా పట్టించుకోలేదంటే ఎంతవరకు నమ్మశక్యం?
లోపల గట్టిగా కేకలు వినిపించాయంటే వివేకా మీద దాడి జరుగుతోందని అప్రమత్తం కావాలి. కిటికీలో నుంచి ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, దస్తగిరిలతోపాటు మరొకరు కనిపించారని రంగయ్యే చెబుతున్నాడు కాబట్టి వాళ్లెవరూ అరవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక మిగిలింది వివేకా మాత్రమే కాబట్టి ఆయనకు ఏమైందో రంగయ్య ఎందుకు అడగలేదు?
సరే.. రంగయ్య భయంతో అరవలేదని భావించినా కనీసం వీధిలోకి వచ్చి కేకలు వేస్తే జనం పోగై వివేకాను రక్షించే అవకాశం ఉంది. అలా చేయాలని రంగయ్యకు ఎందుకు తోచలేదు?
ఇంత జరిగాక ముగ్గురు పారిపోగా.. ఎర్ర గంగిరెడ్డి తాపీగా వచ్చి జరిగింది ఎవరికైనా చెబితే నరికేస్తా..! అని రంగయ్యను హెచ్చరించి వెళ్లాడట. తరువాతైనా రంగయ్య లోపలికి వెళ్లి ఏం జరిగిందో చూడాలి కదా? కానీ లోపలికి వెళ్లలేదు.
మరి అంత భయపడ్డ రంగయ్య ఏం చేయాలి? వెంటనే పారిపోవాలి. అలా కాకుండా ఏమీ జరగనట్లుగా ఆ ఇంటి వాకిట్లోనే నిద్రించాడు.

నార్కో పరీక్షల్లో నోరెత్తని వ్యక్తి నేడు.. 
సిట్‌ అధికారులు గతంలో రంగయ్యను ఆయన కుమారుల సమక్షంలో విచారించినా తనకేమీ తెలియదనే చెప్పాడు. హత్య జరిగిన మర్నాడు ఆయన పీఏ కృష్ణారెడ్డి నిద్ర లేపేవరకు తనకేమీ తెలియదని చెబుతూ వచ్చాడు. పోలీసులు గుజరాత్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఆయనకు నార్కో అనాలసిస్‌ పరీక్షలు చేసినా ఏ విషయాలూ చెప్పలేదు.

ప్రస్తుతం తెలుగు రాని సీబీఐ అధికారులు ఒక ట్రాన్స్‌లేటర్‌ను నియమించుకుని అడిగిన ప్రశ్నలకు రంగయ్య స్పందించి పలు అంశాలను వెల్లడించాడనటం సందేహాస్పదంగా మారింది. అంటే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిపుణులు నిర్వహించే నార్కో అనాలసిస్‌ పరీక్షలకు విలువ లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రంగయ్యను ప్రలోభపెట్టి ఆయనతో ఎవరైనా సీబీఐ ద్వారా   వాంగ్మూలం ఇప్పించారా? అనే సందేహాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి.  

మరిన్ని వార్తలు