ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నా: నారాయణ విద్యార్థి

26 Mar, 2021 09:36 IST|Sakshi

నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య 

తన మృతికి కళాశాల యాజమాన్య ఒత్తిడే కారణమంటూ సూసైడ్‌ నోట్‌ 

వైఎస్సార్‌ జిల్లాలో ఘటన 

బి.కోడూరు: నారాయణ కళాశాల యాజమాన్య వేధింపులు తాళలేక మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్‌ జిల్లా బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన నేలటూరి శ్రీనివాసులరెడ్డి(17) కడప నారాయణ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కళాశాల యాజమాన్యం చదువు విషయంలో తీవ్ర ఒత్తిడికి గురిచేయడంతో మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల కిందట ఇంటికి వెళ్లాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యమేనని, రెండు రోజులుగా వారు చేసిన ఒత్తిళ్లకు మానసికంగా ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సూసైడ్‌ నోట్‌ రాశాడు.

‘నన్ను మీరు కని పెంచినందుకు క్షమించండి’ అంటూ తల్లిదండ్రులనుద్దేశించి అందులో పేర్కొన్నాడు. ఐ మిస్‌ యూ అమ్మ.. మిస్‌ యూ నాన్న.. మిస్‌ యూ బ్రదర్స్‌.. అంటూ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. అంతేకాకుండా తన అరచేతిపై ‘ప్రెజర్‌ ఇన్‌ కాలేజ్‌’ అని రాసుకున్నాడంటూ తల్లిదండ్రులు నేలటూరి సుబ్బారెడ్డి, ప్రమీలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసులరెడ్డి వారికి మూడో సంతానం. చేతికి అందివచ్చిన కుమారుడు మృతిచెందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. బి.కోడూరు ఎస్‌ఐ వెంకటరమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: ఆస్తి ఇవ్వలేదని టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య

మరిన్ని వార్తలు