ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు

13 Dec, 2021 04:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో షెల్‌ కంపెనీల ముసుగులో రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధులు కొల్లగొట్టిన కేసులో అరెస్టుల పర్వానికి తెరలేచింది. రూ. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.

పుణేకు చెందిన డిజైన్‌ టెక్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్‌ వారంట్‌ పొంది విజయవాడ తీసుకువచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారు.
 
సోదాలు నిర్వహిస్తుండగా రాధాకృష్ణ హల్‌చల్‌

సీఐడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ చానల్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో నిధుల దారి మళ్లింపు కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడైన అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌ కె.లక్ష్మీ నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా వేమూరి రాధాకృష్ణ అక్కడకు చేరుకుని హల్‌చల్‌ చేయడం వివాదాస్పదమైంది.

ఆయన తన అనుచరులతో బయట సీఐడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఐడీ సోదాల ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయడం ఆపాలని, బయట అనుచరులను అదుపు చేయాలని సీఐడీ అధికారులు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. దాంతో సీఐడీ అధికారులు తీవ్ర ఒత్తిడి మధ్యే పంచనామా పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ పంచనామాలోని అంశాలను త్వరగా న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉన్నందున సీఐడీ అధికారులు వెంటనే విజయవాడకు తిరిగి వచ్చేశారు. అనంతరం వేమూరి రాధాకృష్ణ తమ విధులకు ఆటంకం కలిగించిన విషయంపై విజయవాడలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో 353, 341, 186, 120(బి) సెక్షన్ల ద్వారా ఆయనపై జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద ఆదివారం కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు. 

చదవండి: దోపిడీలో స్కిల్‌.. బాబు గ్యాంగ్‌ హల్‌'షెల్‌'

 

మరిన్ని వార్తలు