వ్యాక్సిన్ కోసం వెళ్తే రూ.25 లక్షలు, నగలు దోచుకెళ్లిన దొంగలు

13 May, 2021 10:47 IST|Sakshi

న్యూఢిల్లీ: కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆటో రిక్షా డ్రైవర్ ఇంటిని దోచుకెళ్లిన సంఘటన ఈశాన్య ఢిల్లీలోని శివ విహార్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఆటో డ్రైవర్, అతని భార్య టీకాలు వేసుకోవడానికి వెళ్ళినప్పుడు సుమారు 25 లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన ఆభరణాలను దొంగలు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బాధితుడు అరవింద్ కుమార్ పట్వా(40) బుధవారం టీకాలు వేయించుకోవడానికి  స్లాట్ బుక్ మంగళ వారం చేశాడు. మరుసటి రోజు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుంచి టీకా కేంద్రానికి బయలుదేరారు. 

అయితే, డ్రైవర్ తన ముగ్గురు పిల్లలను ఉస్మాన్పూర్ లోని ఉన్న తన అత్తగారి ఇంటి వద్ద దింపేసి, తన భార్యతో కలిసి లక్ష్మి నగర్ లో ఉన్న టీకా కేంద్రానికి వెళ్ళాడు. తర్వాత టీకా కేంద్రం నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ప్రధాన ద్వారం తెరిచి ఉండటం గమనించాడు. అతను వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా అల్మిరా తెరిచి ఉంది. నిందితులు ఆభరణాలు, నగదును తీసుకెళ్లారని పట్వా పేర్కొన్నారు. ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు కూడా ఉన్నాయని చెప్పారు. 

"నా సోదరి ఆభరణాలు కూడా అల్మిరాలో ఉన్నాయి. నిందితులు విలువైన వస్తువులన్నింటినీ తీసుకెళ్లారు. మేము ఇంట్లో లేనప్పుడు, ఇంటి బయట కూర్చున్న ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితుల గురించి తన సహచరులతో ఫోన్‌లో మాట్లాడటం పొరుగువారు చూసినట్లు" పట్వా పేర్కొన్నారు. తాను ఆటో రిక్షా డ్రైవర్‌ని, తన నివాసంలో 'రాఖీ' వ్యాపారం నడుపుతున్నానని పట్వా చెప్పారు. గత 15 రోజులుగా తాను, తన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రాలేదని చెప్పారు. కరవాల్ నగర్ పోలీస్ స్టేషన్లో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం తదుపరి దర్యాప్తు కొనసాగించనున్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

చదవండి:

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

మరిన్ని వార్తలు