ప్రాణాలు పోతుంటే ఎన్నికల కౌంటింగా? ప్రశ్నించిన సుప్రీం

1 May, 2021 13:29 IST|Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌  పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌కు సుప్రీం కోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా నిబంధనల్ని పాటిస్తూ కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్‌లో ఏప్రిల్‌ 15, 19, 26, 29 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించిన టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకింది. వీరిలో 577 మంది టీచర్లు మృతి చెందినట్లు టీచర్స్ అసోసియేషన్ చెబుతోంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మే 2వ తేదీ పంచాయతీ ఎన్నికల ఫలితాలనైనా నిలిపివేయాలనే డిమాండ‍్లు వినిపించాయి.

ఈ నేపథ్యంలో  ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కౌంటింగ్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  'ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కౌంటింగ్‌ను వాయిదా వేయాలని మీరు భావించారా? ఎటు చూసినా సమస్యలే. మీకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. అందుకు ఎన్నికల సంఘం.. పంచాయతీ ఎన్నికల లెక్కింపును వాయిదా వేయడం వల్ల కరోనాపై పోరాడేందుకు నియమితులైన 5 లక్షల మంది సిబ్బంది సేవలు వృధా అవుతాయని వివరణిచ్చింది. ఈ వివరణపై సంతృప్తి చెందిన అత్యున్నత న్యాయం స్థానం..800 కేంద్రాల్లో 2 లక్షలకుపైగా సీట్లకు కౌంటింగ్‌ జరపాల్సి ఉంటుంది. ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో 800 సీట్లను లెక్కించే సమయంలో ఎక్కువ మంది ఉంటే ఎలా కట్టడి చేస్తారని అనుమానం వ్యక్తం చేసింది. 

దీనిపై రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ ఉన్నందున  పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, అలా చేస్తే ప్రజల్ని నియంత్రిచడం సులభం అవుతుందని" అదనపు సొలిసిటర్ జనరల్ భాటి అన్నారు. ప్రతి అంశాన్ని అఫిడవిట్‌లో పొందుపరుస్తామని వివరించారు. దీంతో సుప్రీంకోర్ట్‌ కరోనా నిబంధనల్ని పాటిస్తూ ఎన్నికల కౌంటింగ్‌ నిర‍్వహించాలని ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 

Read latest Delhi News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు