బతుకుబండి దౌడు

27 Mar, 2023 02:26 IST|Sakshi
రామచంద్రపురం రోడ్డులో పండ్ల దుకాణం

మండపేట: ఒకప్పుడు ఊరికీ ఊరికీ మధ్య నిర్మానుష్యంగా ఉండే పొలిమేరలు రంగురంగుల షాపింగ్‌ గొడుగులు, మొబైల్‌ గుడారాలు, టెంపరరీ షాపులతో మినీ బజార్లుగా మారుతున్నాయి. చెట్లు, వాటి నీడలే షెల్టర్లవుతున్నాయి. ఉప్పు చేప మొదలు సీజనల్‌ పండ్లు, కాయగూరలు, గృహోపకరణాలు, నాటుకోళ్లు, నిత్యావసర వస్తువులు రోడ్డు పక్కన వెలుస్తున్న దుకాణాల్లో సరుకులవుతున్నాయి. సమయం, సొమ్ము ఆదా అవుతుండటంతో ఈ దుకాణాల వద్ద కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

రకరకాల వస్తువులు లభ్యం
కోవిడ్‌ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉపాధి అన్వేషణ కొత్తపుంతలు తొక్కుతోంది. సాధారణంగా పట్టణాలు, గ్రామాల్లో రోడ్లు మార్జిన్లు, ప్లాట్‌ఫాంలపైన, తోపుడుబండ్లు, సైకిళ్లపై చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించడం పరిపాటి. ఊరుకి ఊరికీ మధ్య ఏ వ్యాపారాలు ఉండేవి కావు. వేసవిలో కళ్లజోళ్లు, టోపీలు, శీతాకాలంలో స్వెట్టర్లు, వర్షాకాలంలో రెయిన్‌కోట్లు అలా అక్కడక్కడా రోడ్ల పక్కన అరుదుగా తాత్కాలిక దుకాణాలు కనిపించేవి. ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌తో అరుదుగా లభించే వస్తువులు, సీజనల్‌ పండ్లు, శీతల పానియాలు, స్వీట్లు, నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, కూరగాయలు, ఇతర పంటల ఉత్పత్తులు, మల్టీ మాల్స్‌లో లభించే వస్తువులు సైతం రోడ్డు పక్కన సరికొత్తగా వెలుస్తున్న మొబైల్‌ షాపుల్లో దొరికేస్తున్నాయి. ఎంతోమంది ఉపాధికి ఈ రహదారి వ్యాపారాలు ఆలవాలం అవుతున్నాయి.

రద్దీ రోడ్లలోనే అధికం
ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే రోడ్లు ఈ తరహా వ్యాపారాలకు అనుకూలంగా ఉంటున్నాయి. కాకినాడ– రామచంద్రపురం రోడ్డు, మండపేట – జొన్నాడ రోడ్డు, సామర్లకోట – రాజమహేంద్రవరం కెనాల్‌ రోడ్డు, అమలాపురం – కొత్తపేట రోడ్డు, కాకినాడ–యానాం రోడ్డు, రావులపాలెం–తణుకు హైవే తదితర రోడ్లలో గ్రామాల మధ్యలో పదుల సంఖ్యలో దుకాణాలు వెలుస్తున్నాయి. నిత్యం వ్యాపారం జరిగే అనువైన స్థలాలు కాకపోయినా సరికొత్త ట్రెండ్‌తో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. రాత్రంతా నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం తెల్లారేసరికి ఏవేవో కొత్త సామాన్లతో క్షణాల్లో షాపులు వెలుస్తున్నాయి. మళ్లీ సాయంత్రమయ్యే సరికి ఆ ప్రాంతాలు ఖాళీ అయి పోతున్నాయి. ఒకప్పుడు వారాంతపు సంతల్లోనో, తిరునాళ్లు.. తీర్థాలప్పుడో గ్రామాల్లో ఇలాంటి దుకాణాలు పుట్టుకొచ్చేవి. ఇప్పుడు అటు షాపు నిర్వాహకులకు ఉపాధి, ఇటు ప్రయాణికులకు అందుబాటులో వినియోగవస్తువులు రావడంతో ఉభయ తారకంగా ఈ వ్యాపారాలు అన్నిచోట్ల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

షాపులతో పోలిస్తే తక్కువ ధరకే..
సాధారణంగా షాపుల్లో కొనుగోలుచేసే వస్తువులపై అద్దె, విద్యుత్‌ చార్జీలు, సిబ్బంది జీతభత్యాలు ఇతర నిర్వహణ వ్యయం పడుతుంది. రోడ్లు పక్కన దొరికే ఈ వస్తువులపై అటువంటి భారం లేకపోవడంతో చౌకగా లభిస్తున్నాయి. బీజీ లైఫ్‌లో పని ముగించుకుని హడావుడిగా ఇంటికి చేరుకునే సమయంలో వస్తువుల కోసం షాపుల వద్దకు పరుగులు తీయడం అదనపు భారమవుతోంది. రోడ్లు పక్కన వెలుస్తున్న ఈ దుకాణాలు ఆపద్బాంధవుల్లా ఉపయోగపడుతున్నాయి. సమయం, ధరలు కలిసిరావడంతో ఈ దుకాణాల వద్ద కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యాపారం బాగుండటంతో రోజురోజుకు రకరకాల షాపులు వెలుస్తూనే ఉన్నాయి. ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లే చాలామంది ఇటీవల కాలంలో ఇటువంటి షాపులు పెట్టుకుని బతుకుబండి నడిపించుకుంటున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి
ఏడాదిగా రోడ్డు పక్కన ఎండు చేపల వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారం బాగానే జరుగుతోంది. విశాఖ, మచిలీపట్నం, కాకినాడ, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి రకరకాల ఎండుచేపలు, ఎండు రొయ్యలు తెచ్చి అమ్మకాలు చేస్తున్నాం.
– పి.శ్రీనివాస్‌, గోపాలపురం

సమయం కలిసొస్తోంది
పనిగట్టుకుని ఊళ్లోని షాపుల వద్దకు వెళ్లాల్సిన పనిలేకుండా వెళ్లే దారిలోనే కావాల్సిన వస్తువులు దొరుకుతున్నాయి. మార్కెట్‌ ధరలతో పొలిస్తే తక్కువకే వస్తున్నాయి. సమయం, సొమ్ము కూడా ఆదా అవుతున్నాయి.
– వాసంశెట్టి శ్రీనివాసరావు,

 

మరిన్ని వార్తలు