గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

28 Mar, 2023 02:32 IST|Sakshi

అమలాపురం రూరల్‌: జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతి ఆశాజనకంగా లేదని, దీనిని మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మండల, జిల్లా స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, వివిధ అంశాలపై సమీక్షించారు. స్టేజ్‌ కన్వర్షన్‌ ద్వారా గృహ నిర్మాణాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించాలని ఆదేశించారు. మండపేట మున్సిపాలిటీలో టిడ్కో ఇళ్ల రుణాల మంజూరుపై బ్యాంకర్లతో వర్చువల్‌గా సమీక్షించి, అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. గత ఏడాది గోదావరి వరదల సమయంలో పశుగ్రాసం కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ ఏడాది వరదల సన్నద్ధతలో భాగంగా రబీలో వచ్చిన ఎండు గడ్డిని మండలాల్లో నిల్వ చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కార స్థితిగతులపై మండల స్థాయి పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. జాయింట్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర మాట్లాడుతూ, రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు మాట్లాడుతూ, తహసీల్దార్లు, దాతల సహకారంతో ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఐదు శాతం పడకలను వడదెబ్బ బాధితులకు కేటాయించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించి, విద్యార్థుల ఆరోగ్య భద్రతకు, పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఓ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి సీహెచ్‌ బాబూరావు, డీసీహెచ్‌ఎస్‌ పద్మశ్రీరాణి, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్‌ ఎ.జైపాల్‌, గ్రామ/వార్డు సచివాలయ నోడల్‌ అధికారి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

రామచంద్రపురం రూరల్‌: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలానికి రామచంద్రపురం నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్‌ కొడమంచిలి వెంకటేశ్వర్లు సోమవారం విలేకర్లకు తెలిపారు. వివరాలకు 73829 25520, 73829 12083, 73829 12064 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు