స్పందనకు 215 అర్జీలు

28 Mar, 2023 02:32 IST|Sakshi
స్పందనలో అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

అమలాపురం రూరల్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 215 మంది అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జాయింట్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, డీఆర్‌ఓ సీహెచ్‌ సత్తిబాబు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, స్పందన అర్జీలపై రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థ కొనసాగుతోందని, అర్జీలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించకుంటే రీ ఓపెన్‌కు చర్యలు తీసుకుంటారని స్పష్టం చెప్పారు. అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, సకాలంలో పరిష్కారాలు చూపాలని, పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఒకసారి వచ్చిన అర్జీ మళ్లీ రాని విధంగా పరిష్కారం చూపాలన్నారు. మండల స్థాయి అర్జీలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండల అధికారులతో సంప్రదించి, అక్కడికక్కడే పరిష్కారాలు చూపారు. డీఆర్‌ఓ సత్తిబాబు మాట్లాడుతూ, జిల్లా అధికారులు తమ పరిధిలోని కోర్టు కేసులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని కౌంటర్లు ఫైల్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మమ్మల్ని వెలి వేశారు..

తమను సంఘం నుంచి వెలివేశారంటూ కె.గంగవరం మండలం భట్లపాలిక గ్రామానికి చెందిన మేడిశెట్టి నరసింహమూర్తి, మేడిశెట్టి సత్యనారాయణ, ఆయన భార్య వెంకటలక్ష్మి స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సంఘ పెద్దల నుంచి తమకు ప్రాణ, ఆస్తి నష్టాలు ఉన్నాయని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు