టెన్త్‌ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

28 Mar, 2023 02:32 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌జేడీ నాగమణి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే నెల 3వ తేదీ నుంచి జరిగే పదో పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేశామని జోన్‌–2 ప్రాంతీయ విద్య సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీ) జి.నాగమణి తెలిపారు. జోన్‌ పరిధిలోని ఏడు జిల్లాల విద్యాశాఖాధికారులు, పరీక్షల నిర్వహణాధికారులు, చీఫ్‌ కోడింగ్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ కోడింగ్‌ ఆఫీసర్లతో స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆమె సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బార్‌కోడింగ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. బార్‌కోడింగ్‌ విధానం అమలును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమగ్రంగా వివరించారు. విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షల మూల్యాంకనం చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు, అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 2007లో బార్‌కోడింగ్‌ విధానం ప్రారంభించారన్నారు.

ఈ విధానంలో సమాధాన పత్రం ఎవరిదో మూల్యాంకనం చేసేవారికి తెలియదని చెప్పారు. సమాధాన పత్రాలు గతంలో ఏ జిల్లాకు వెళ్లేవో తెలిసేవని, బార్‌ కోడింగ్‌ విధానంలో ఏ సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయన్నది తెలియదని, అలాగే బుక్‌లెట్‌ విధానం వలన మాస్‌ కాపీయింగ్‌కు కూడా అవకాశం లేదని వివరించారు. బార్‌ కోడింగ్‌, బుక్‌లెట్‌ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓలకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారులు ఎస్‌.అబ్రహం (తూర్పు గోదావరి), కేఎన్‌వీఎస్‌ అన్నపూర్ణ (కాకినాడ), ఆర్‌వీ రమణ (పశ్చిమ గోదావరి), తూర్పు గోదావరి జిల్లా ఇన్‌చార్జి పరీక్షల కమిషనర్‌ ఎ.ఛాయాదేవి, ఏడీ కె.సుబ్బారావు, రాజమహేంద్రవరం డివిజన్‌ ఉప విద్యా శాఖాధికారి ఎం.తిరుమలదాస్‌, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు కార్యదర్శి ఎం.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు