అందాల స్వామికి.. కల్యాణ వేడుక

28 Mar, 2023 23:44 IST|Sakshi
ర్యాలి గ్రామంలోని జగన్మోహినీ కేశ్వస్వామి వారి ఆలయం

రేపు జగన్మోహినీ కేశవస్వామి వారి పరిణయం

వచ్చే నెల 6వ తేదీ వరకూ ఉత్సవాలు

ముస్తాబైన ర్యాలి పుణ్యక్షేత్రం

ఆత్రేయపురం: జగత్తులోని సౌందర్యాన్నంతటినీ పోత పోసినట్టు.. మిసమిసలాడుతూ దర్శనమిచ్చే నునుపైన సాలగ్రామ శిలావిగ్రహం.. ముందు పురుషాకృతి.. వెనుక భాగాన సీ్త్ర రూపం.. ఇటువంటి ఏకశిలా మూర్తిగా.. స్వయంభువుగా వెలసిన వేలుపు జగన్మోహినీ కేశవస్వామి. ఈ స్వామిని దర్శిస్తే సమస్త పాపాలూ హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ అందాల స్వామి కల్యాణ వేడుకకు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ర్యాలి గ్రామం ముస్తాబవుతోంది. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 6 వరకూ స్వామి వారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

అడుగడుగునా అద్భుతాలే..

ఫ ఇక్కడ స్వామివారి సౌందర్యాన్ని వర్ణించనలవి కాదు. స్వయంగా చూసి తీరవలసిందే అన్నట్టుగా ఉంటుంది.

ఫ ఈ ఆలయంలో జగన్మోహినీ కేశవస్వామి ఐదడుగుల సాలగ్రామ ఏకశిలా మూర్తిగా దర్శనమిస్తారు. ముందు కేశవస్వామి, వెనుక భాగంలో జగన్మోహినిగా సీ్త్ర రూపంలో అవతరించారు. సీ్త్రమూర్తి కొప్పున శిఖ చుట్టుకున్నట్టు.. అందులో చామంతి పుష్పం.. అప్పుడే సంపంగి నూనె రాసినట్టు అందంగా, ఒద్దికగా తీర్చిదిద్దిన కురులు.. దండకడియాలు.. కచ్చా పోసిన రీతిలో చీరకట్టు.. పద్మినీ జాతి సీ్త్రలకు శుభసూచకమని భావించేలా కుడికాలి తొడపై తెల్లగా, పొడవుగా పుట్టుమచ్చ.. కాళ్లకు అందెలు, గజ్జెలు దర్శనమిస్తాయి.

ఫ ఈ శిలా విగ్రహంలో కిరీటం; మకర కుండలాలు; కర్ణపత్రాలు; కంఠంపై త్రివళులు (ముడుతలు); కౌస్తుభ మణిహారాలు; జపమాల; యజ్ఞోపవీతం; స్ఫుటంగా సొగసైన నాభిస్థానం; ఉత్తరీయం; శంఖం, చక్రం, గద పట్టుకున్న హస్తాలు; చేతివేళ్లకు ఉంగరాలు; అందంగా కొనదేలిన గోళ్లు; అభయ హస్తం, దానిపై రేఖలు సైతం ఎంతో అద్భుతంగా దర్శనమిస్తాయి.

ఫ ఇంకా స్వామి వారి దేవేరులు శ్రీదేవి, భూదేవి.. స్వామి పాదాల చెంతనే సేవ చేసుకుంటున్న గరుత్మంతుడిని ఇక్కడ దర్శించవచ్చు. స్వామి వారి రెండు పాదాల మధ్యన పద్మాసనంలో గంగాదేవి కొలువుదీరింది. ఆమె తన పవిత్ర జలాలతో స్వామివారి రెండు పాదాలనూ నిరంతరం కడుగుతున్నట్టుగా దర్శనమిస్తుంది.

ఫ స్వామి వారి ఉభయ పార్శ్వాల్లో పొన్నచెట్టు, గోవర్ధన గిరి ఎత్తిన శ్రీకృష్ణభగవానుడు, మకరతోరణం రీతి, దశావతారాలు, గానం చేస్తున్న తుంబుర నారదులు, స్వామివారికి పుష్పమాలలు వేస్తున్న కిన్నెర, కింపురుషాదులు, నృత్య భంగిమల్లో రంభ, ఊర్వశి అప్సరసలు, పడగ విప్పిన ఆదిశేషుడు దర్శనమిస్తారు.

ఫ ఈ ఆలయ నిర్మాణం 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజు రాజరాజనరేంద్రుని కాలంలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగానే ఇటువంటి దేవాలయం లేదని చెబుతారు. ఈ స్వామి దర్శనం భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది.

ఫ జగన్మోహినీ కేశవస్వామి ఆలయానికి ఎదురుగా పడమర వైపు శ్రీ ఉమా కమండలేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది కూడా అద్భుత దేవాలయం. ఈశ్వరునిపై అభిషేకం చేసిన జలాలు పానపట్టంలోనే ఇంకిపోవడం ఇక్కడి ప్రత్యేకత. అందువలన ఈ ఆలయంలో అభిషేక జలాలు బయటకు వచ్చే సోమసూత్రంతో పాటు చండీశ్వరుని విగ్రహం కూడా ఉండవు.

ఫ ఆలయంలో ఎత్తయిన పురాతన గాలిగోపురం, గర్భగుడి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల విగ్రహాలు భక్తులను తన్మయుల్ని చేస్తాయి.

ఫ ఆలయ గర్భగుడి ప్రాంగణంలో అత్యంత లోతైన సొరంగ మార్గం ఉంది. ఇది పూర్వం ఉపయోగించేవారని అంటారు.

ఏర్పాట్లు పూర్తి

శ్రీ జగన్మోహినీ కేశవస్వామి వారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. వీటికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అందుకు తగినట్టుగా సౌకర్యాలు కల్పించాం.

– కృష్ణచైతన్య, కార్యనిర్వహణాధికారి,

ర్యాలి దేవస్థానం

క్షీరసాగర మధనానంతరం..

క్షీరసాగర మధన సమయంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా అవతారంలో దేవదానవులకు అమృతం పంచి పెట్టి రథంపై వస్తున్నారట. గౌతమి – వశిష్ఠ గోదావరి పాయల మధ్య ప్రాంతంలోని రత్నాపురం గ్రామం వద్ద ఆయన రథం శీల (ఇరుసు) రాలి పడిందట. వెనుతిరిగి చూసేసరికి, అపూర్వ సౌందర్యరాశిగా ఉన్న తన జగన్మోహినీ అవతారం చూసి, మోహితుడైన పరమ శివుడు తనను వెంబడిస్తున్నట్టు గమనించారట. దీంతో ఆయనను ఆపేందుకు నిజరూపంతో ముందు పురుష, వెనుక సీ్త్ర రూపంలో జగన్మోహినీ కేశవస్వామిగా సాలగ్రామ శిలారూపంలో.. ఇక్కడ వెలిశారని స్థల పురాణం చెబుతుంది. అంతేకాదు.. జగన్మోహినీ అవతారం విష్ణుమాయ అని గ్రహించిన శివుడు సిగ్గుపడి.. కేశవస్వామికి ఎదురుగా ఉమా కమండలేశ్వరునిగా అవతరించారట. రథం శీల రాలి పడిన గ్రామం కనుక నాటి రత్నాపురం కాస్తా.. నేడు ర్యాలిగా పేరొందింది.

భస్మాసుర వధతో ముడి పడిన మరో కథ

భస్మాసురుడిని అంతమొందించే సమయంలో కూడా శ్రీమన్నారాయణుడు మోహినీ అవతారం ఎత్తారు. ఆమె సౌందర్యాన్ని చూడాలనే కుతూహలంతో పరమేశ్వరుడు ఆమెను వెంబడిస్తూ రత్నాపురం గ్రామానికి చేరాడని, ఇక్కడే శ్రీమహావిష్ణువు మోహినీ రూపాన్ని వీడి.. పరమ శివుని ఎదుట జగన్మోహినీ కేశవస్వామిగా సాక్షాత్కరించారని చెబుతారు. నిజం గ్రహించిన శివుడు ఇక్కడ ఉమా కమండలేశ్వరునిగా ఆవిర్భవించారని అంటారు.

భక్త విక్రమ దేవుని స్వప్నం

పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అరణ్యంగా ఉండేది. విక్రమ దేవుడు అనే భక్తుడు ఈ ప్రాంతంలో వేట సాగిస్తూ ఒక చెట్టు వద్ద నిద్రించాడు. అతడికి శ్రీమహావిష్ణువు కలలో కనబడి, స్వయంభూ శిలారూపంలో తాను ఆ ప్రాంతంలో ఉన్నానని, కర్రతో రథం చేయించి లాక్కొని వెళ్తే.. ఆ రథం శీల రాలి పడుతుందని, అక్కడ తవ్వితే తన విగ్రహం బయట పడుతుందని చెప్పి అదృశ్యమయ్యారని అంటారు. ఆ ప్రకారమే విక్రమ దేవుని ద్వారా ఈ విగ్రహం బయట పడిందని ఆలయ చరిత్ర చెబుతోంది.

కల్యాణోత్సవాల క్రమమిదీ..

ఫ ఈ నెల 30: ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం గరుడ వాహన సేవ, రాత్రి 8 గంటలకు కల్యాణోత్సవం.

ఫ ఏప్రిల్‌ 3: పండిత సదస్యం

ఫ 5: చక్రస్నానం

ఫ 6: శ్రీపుష్పోత్పవం

మరిన్ని వార్తలు