రైతు సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

28 Mar, 2023 23:44 IST|Sakshi
రైతు సమస్యలపై కలెక్టర్‌ శుక్లాతో చర్చిస్తున్న నాగిరెడ్డి

సాక్షి, అమలాపురం: జిల్లాలో సముద్ర మొగ ద్వారా ఎదురవుతున్న ముంపు సమస్య పరిష్కారం, ఏటిగట్ల బలోపేతం, పంట కాలువలు, మురుగునీటి కాలువల్లో గుర్రపు డెక్క, తూడు తొలగింపు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. ఈ విషయాలపై కలెక్టర్‌ హిమాన్షు శుక్లాతో చర్చించామని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం పర్యటించిన ఆయన అమలాపురంలో కలెక్టర్‌ శుక్లా, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులతో చర్చించారు. కోనసీమ రైతుల సమస్యలు, గోదావరి డెల్టా ఆధునీకరణ ప్రతిపాదనలను, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ శుక్లా వివరించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. వివిధ కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యత నిధులతో గోదావరి డెల్టాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. శ్రీదివంగత వైఎస్సార్‌కు, ప్రస్తుత సీఎం జగన్‌కు ప్రకృతితో చుట్టరికం ఉంది. దీనివల్ల రబీకి ఎటువంటి ఇబ్బందీ రాకుండా ఉందని, దిగుబడులు ఆశాజనకంగా వస్తాయని చెప్పారు. అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ మరమ్మతు పనులు 25 వరకూ చేపట్టారని, 15 పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. గోదావరి డెల్టాకు రబీ సీజన్‌లో సాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నమవుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకునే నాడు దివంగత వైఎస్సార్‌ పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. పోలవరం పూర్తయి, రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ఉంటే ఇప్పుడు ఈ తరహా సాగునీటి ఎద్దడి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావని నాగిరెడ్డి స్పష్టం చేశారు. అంతకు ముందు ఆయన స్థానిక డీసీసీబీ బ్రాంచి కార్యాలయాన్ని పరిశీలించారు. బ్యాంకు రుణ పరపతి, రుణాల కల్పనపై బ్యాంక్‌ అధికారులతో సమీక్షించారు. అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి), వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రీజినల్‌ కార్యదర్శి కె.త్రినాథ్‌రెడ్డి, గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ సత్తి శ్రీనివాస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి

ఫ వివిధ ప్రాంతాల్లో పర్యటన..

అధికారులతో చర్చ

0000533163-000001-Satellite Servi 12.00x8.00 Satellite Services

మరిన్ని వార్తలు