బాలబాలాజీ హుండీ ఆదాయం రూ.8.71 లక్షలు

30 Mar, 2023 02:22 IST|Sakshi
బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేస్తున్న న్యాయమూర్తి శ్రీనివాస్‌ తదితరులు

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 23 రోజులకు హుండీల ద్వారా స్వామివారికి రూ.8.71 లక్షలు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంకేటీ నాగవరప్రసాద్‌ తెలిపారు. ఎండోమెంట్స్‌ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు, వానపల్లి పళ్లాలమ్మ ఆలయ ఈఓ బొక్కా వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. హుండీల ద్వారా రూ.8.53 లక్షల ఆదాయం వచ్చింది. అన్నదానం హుండీ ద్వారా రూ.18,196 రాగా మొత్తం రూ.8.71 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిట్టూరి రామకృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ గెడ్డం కృష్ణమూర్తి, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టాల సత్తిబాబు, గూటం శ్రీను, కొమ్ముల సూరిబాబు, బొరుసు పార్వతిదుర్గాభవాణి, పెదమల్లు ఉషారాణి, ఉప ప్రధానార్చకులు మద్దాలి తిరుమల శింగరాచార్యులు పాల్గొన్నారు.

బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన జూనియర్‌ సివిల్‌ జడ్జి

ముమ్మిడివరం: స్థానిక బీసీ బాలుర వసతి గృహాన్ని ముమ్మిడివరం జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.శ్రీనివాస్‌ బుధవారం తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్ల పనితీరును న్యాయమూర్తులు తనిఖీ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆయన వసతి గృహంలో మౌలిక వసతులపై ఆరా తీశారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి విషయాలను పరిశీలించారు. వసతి గృహం పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వసతి గృహ సిబ్బందికి సూచించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాశి సిద్ధార్ధకుమార్‌, న్యాయవాదులు కేఎల్‌వీ ప్రసాద్‌, హలీ హసన్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నేతన్న నేస్తంతో బాసట

ఆప్కో చైర్మన్‌ చిరంజీవి

అమలాపురం రూరల్‌: జగనన్న నేతన్న నేస్తం పఽథకంతో ఏటా రూ.24 వేలు అందిస్తూ రాష్ట్రంలో ఉన్న 90వేల మంది చేనేత కార్మికుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి అన్నారు. బండారులంకలో పేరివారికాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 12 చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.75వేలు చొప్పున బుధవారం తక్షణ సాయం అందించారు. ఆయన మాట్లాడుతూ కోర్టు వివాదం కారణంగా రాష్ట్రంలో చేనేత సొసైటీలకు రూ.16 కోట్ల ఆప్కో బకాయిల చెల్లింపులో జాప్యం జరిగిందని, త్వరలో చెల్లిస్తామని తెలిపారు. తొలుత బండారులంక చేనేత సంఘాన్ని పరిశీలించారు. ఆప్కో డైరెక్టర్‌ అవ్వారి సుబ్బరాయుడు, వైఎస్సార్‌ సీపీ కోనసీమ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు కాలేపు నాగ శ్రీనివాస్‌, చేనేత సొసైటీ చైర్మన్‌ చింతా ఉమా మహేశ్వరరావు, ఉప సర్పంచ్‌ కామిశెట్టి శ్రీనివాస్‌, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరిరామ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు