‘నన్నయ’లో ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సు

25 Sep, 2023 02:30 IST|Sakshi

సీఎస్‌ఐఆర్‌తో అవగాహన ఒప్పందం

యువత ఉపాధి అవకాశాలకు

మెరుగైన రంగం

రాజానగరం: ఆహార సాంకేతికత (ఫుడ్‌ టెక్నాలజీ) అనేది ఆహార శాస్త్రంలో ఒక శాఖ. ఇది ఆహార ఉత్పత్తుల సంరక్షణ, నాణ్యత నియంత్రణ, పరిశోధన, అభివృద్ధిని సూచిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన అదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు గోదావరి జిల్లాలలోని యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలనే ఆశయంతో ఎమ్మెస్సీలో ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సుకు శ్రీకారం చుట్టారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో మ్యాన్‌పవర్‌కి పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో ఇటువంటి కోర్సుల ఆవశ్యకతను గుర్తించారు. సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఫర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ), కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా (మైసూర్‌) సహకారంతో ‘నన్నయ’ వర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెడుతున్నారు.

పీజీ సెట్‌ ద్వారా ప్రవేశాలు

ఏపీ పీజీ సెట్‌ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న కౌన్సెలింగ్‌లో ‘ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సైన్స్‌ని ఎంపిక చేసుకొని ఈ కోర్సులో చేరవచ్చు. ఎమ్మెస్సీ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సు చేసేందుకు బీఎస్సీ ఫుడ్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఒకేషనల్‌ ఫుడ్‌ టెక్నాలజీ, బీఎస్సీ బయో టెక్నాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బీఎస్సీ హోమ్‌సైన్స్‌, బీఎస్సీ అప్‌లైడ్‌ న్యూట్రిషన్‌, బీఎస్సీ రూరల్‌ హోమ్‌ సైన్స్‌, క్లినిక్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌, బీఎస్సీ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌, బీఎస్సీ న్యూట్రిషన్‌ ఒక పేపరుగా ఉండి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండవలసి ఉంటుంది. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రస్తుతం 20 సీట్లతో ఈ కోర్సును ప్రారంభిస్తున్నారు.

నాణ్యమైన విద్యతోపాటు ఉపాధి అవకాశాలు

గోదావరి జిల్లాలలోని యువతకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. భారతదేశంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం 2024 నాటికి 9 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుంది. యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనువైన రంగంగా అభివృద్ధి చెందనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ‘నన్నయ’ వర్సిటీలో ఎమ్మెస్సీలో ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఇటీవల మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐని సందర్శించినప్పుడు ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సు గురించి అక్కడ డైరెక్టర్లతో మాట్లాడాను. యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెడితే అందుకు అవసరమైన మార్గదర్శకాలు ఇవ్వడానికి వారు సుముఖతను వ్యక్తపరిచారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ప్రధాన సంస్థగా ఉన్నందున, ఈ కోర్సుకు సంబంధించి విద్యా కార్యకలాపాలు ఆ సంస్థ నుంచి పొందేందుకు విద్యానిపుణులు, శాస్త్రవేత్తలు సహకరిస్తారని మాటిచ్చారు. విద్యార్థులకు మైసూరులో పూర్తి సెమిస్టర్‌ ఇంటర్నషిప్‌కు అవకాశం కూడా కలిస్తారు. ఈ మేరకు సీఎస్‌ఐఆర్‌తో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం.

– ఆచార్య కె. పద్మరాజు, ఉపకులపతి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ

రూ.80 లక్షలతో ప్రత్యేక ల్యాబ్‌

‘నన్నయ’ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సును అమలు చేసేందుకుగాను రూ.80 లక్షల వ్యయంతో ప్రత్యేక ల్యాబ్‌ని ఏర్పాటు చేయనున్నారు. సీఎఫ్‌టీఆర్‌ఐ వంటి ప్రముఖ సంస్థలలో 40 సంవత్సరాలపాటు అధ్యాపక వృత్తిలో సేవలందించిన ఆచార్య పి.రామకృష్ణను ఈ కోర్సుకు కోఆర్డినేటర్‌గా నియమించారు. యూజీసీ నిబంధనలను అనుసరించి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో కోర్సును సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు