గుండె లయ తప్పుతోంది

29 Sep, 2023 02:10 IST|Sakshi

ముందస్తు సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ముప్పే

హెచ్చరికలపై అందరికీ అవగాహన తప్పనిసరి

ఏటేటా పెరుగుతున్న గుండెపోటు బాధితులు

నేడు గుండె వ్యాధుల నివారణ దినోత్సవం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఔను గుండె లయ తప్పుతోంది. పని ఒత్తిళ్లు, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు వెరసి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే గుండెకు ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు.. హఠాత్తుగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చి కుప్పకూలిపోయారు అంటుంటారు...కానీ,గుండెపోటు వచ్చిన వారిలో కనీసం సగం మందిలో ముందస్తు హెచ్చరికలు లేదా సంకేతాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వాటిని గుర్తించకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమంటున్నారు. ఈ హెచ్చరికలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమంటున్నారు. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండె పోట్లుతో మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గుండె కండరాల భాగం తగిన స్థాయిలో రక్తం పొందలేని అసాధారణ స్థితిలో గుండె పోటు ప్రమాదం ఉంటుంది. ఈ ముప్పు మహిళలతో పోల్చుకుంటే పురుషుల్లోనే అధికమని ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్‌ ఏఎల్‌ సత్యవతి చెబుతున్నారు. మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉంటుందనీ.. రుతుస్రావం సమయంలో ఇది రక్తంలో కలిసి గుండె రక్షణకు దోహదపడుతుందని చెబుతున్నారు. 45 ఏళ్ల వయసు వరకు గుండె పోటు ముప్పు మహిళలు, పురుషుల నిష్పత్తి 1:10 గా ఉండటం గమనార్హం. పురుషుల్లో ఈ ముప్పు అధికంగా ఉండటానికి దురలవాట్లతో పాటు పనిఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణమవుతున్నాయి. వీటితోపాటు 20 నుంచి 50 ఏళ్ల వయసున్న వారిలో వ్యాయామం లేకపోవడమూ కారణమవుతోంది. అమెరికా యూరోప్‌ వంటి దేశాలతో పోలిస్తే మన ప్రాంతంలో గుండెజబ్బులు జన్యుపరమైన కారణాలతో ఎక్కువగా నమోదవుతున్నాయి. గుండె రక్తనాళాల్లో చేరిన పూడికల మీద హఠాత్తుగా రక్తం గడ్డకట్టి రక్తనాళాన్ని పూర్తిగా మూసివేసి గుండెపోటుకు దారితీస్తుందంటున్నారు. చాలా మందిలో ఈ పూడికలు 70 శాతం కన్నా ఎక్కువగానే ఉంటే గుండెపోటుకు దారి తీస్తుంది.

ఈ లక్షణాలున్నాయా..

● పనిచేసినప్పుడు లేదా, నడిచినప్పుడు ఛాతి బరువు, మంట, చాతి భాగంలో పట్టినట్టు ఉండటం, ఎడమ భుజం, దవడ, ఎడమ చేయి నొప్పి ఉంటాయి.

● డయాబెటిస్‌ ఉన్న వారిలో నొప్పి లేకుండా కేవలం ఆయాసం మాత్రం ఉండొచ్చు.

● మహిళల్లో కేవలం 30 శాతం మందిలో మాత్రమే ఛాతి నొప్పి ఉంటుంది.

● వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం, బరువులు మోయటం వంటి పనులు చేస్తున్నప్పుడు గుండెకు మూడు నుంచి ఐదు రెట్లు రక్తసరఫరా అవసరం.

● సహజంగా ఆయాసం వస్తే అది గుండె సంబంధించిన లక్షణంగా అనుమానించాలని చెబుతున్నారు.

● పూడికలు ఎక్కువైనప్పుడు నీరసం పెరిగి చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోయే సందర్భంలో అది గుండె సంబంధించిన లక్షణంగా పరిగణించాలంటున్నారు.

● గుండె నొప్పి ఎడమ దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడైనా రావచ్చు అంటున్నారు.

● కొన్నిసార్లు దవడ నొప్పి, ఎడం భుజం నొప్పి, పొట్ట భాగంలో వస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు.

● 40 సంవత్సరాలు దాటిన వారిలో నిర్లక్ష్యం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

జిమ్‌ కసరత్తుపై అవగాహనేదీ

కోవిడ్‌ అనంతరం హృద్రోగాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నా అవన్నీ మరణాలకు దారి తీస్తున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రముఖ వైద్యులు ఐవీ రావు పేర్కొంటున్నారు. కోవిడ్‌ వైరస్‌ శరీరంలో అన్ని భాగాలలోకి చొచ్చుకెళ్లడం రక్తం చిక్క దనానికి కారణమవుతుందంటున్నారు. జిమ్‌లో చేసే వర్క్‌ అవుట్‌ల పట్ల అవగాహన లేకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. అతిగా ఆయాసపడే వర్క్‌ అవుట్లను నియంత్రించాలంటున్నారు. చెమట ఎంతైతే పోతోందో ఆ మేరకు నీరు తాగాల్సి ఉంటుంది. సోడియం స్థాయి పడిపోకుండా చూసుకోవాలి. మద్యం,ధూమపానం, మాదక ద్రవ్యాల వినియోగం వ్యాయామాల వేళ ముప్పును పెంచుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న హృద్రోగ బాధితులు

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే అతి పెద్ద ఆస్పత్రి కాకినాడ జీజీహెచ్‌. ఈ ఆస్పత్రిలో వారంలో మూడు రోజుల పాటు (సోమ, బుధ శుక్ర) ఓపీ సేవలు, వారం అంతా హృద్రోగ అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం 40 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేసింది. ప్రతి నెలా ఒక్క జీజీహెచ్‌కు 300 నుంచి 400 ఇన్‌పేషెంట్లు(ఐపీ), ప్రతి వారం 300 నుంచి 360 మంది మధ్య గుండె జబ్బులతో జీజీహెచ్‌కు వస్తున్నారు. ఈ సంఖ్య పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీజీహెచ్‌లో గడచిన ఐదు వారాల గణాంకాలు

ఎప్పుడు ఓపీ ఐపీ

ఆగస్టు చివరి వారం : 302 65

సెప్టెంబర్‌ తొలివారం : 311 77

సెప్టెంబర్‌ రెండవ వారం : 337 81

సెప్టెంబర్‌ మూడవ వారం : 322 98

సెప్టెంబర్‌ చివరి వారం : 361 118

త్వరలో క్యాథ్‌ ల్యాబ్‌

జీజీహెచ్లో గుండె చికిత్సకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత ఏమీ లేదు. రక్త నాళాల్లో గడ్డ కట్టిన రక్తాన్ని కరిగించేందుకు వినియోగించే రూ.45 వేలు ఖరీదైన టెనిక్‌టిక్లేజ్‌ ఇంజెక్షన్‌తోపాటు ఇతర మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్‌ ఉండడంతో ప్రమాదకరమైన స్థితి నుంచి కోలుకుంటున్నారు. జీజీహెచ్‌లో త్వరలో క్యాథ్‌ ల్యాబ్‌ సిద్ధమవుతుంది. ఇంటర్‌ వెన్షన్లు, స్టంట్లు సహా కీలకమైన హృదయ సంబంధిత వైద్య సేవలన్నీ సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.

– డాక్టర్‌ లావణ్యకుమారి,

సూపరింటెండెంట్‌.,కాకినాడ జీజీహెచ్‌.

ముందే చెబుతుంది

గుండెపోటు వచ్చిన వారిలో కనీసం సగం మందిలో ముందస్తు హెచ్చరికలు, సంకేతాలు ఉంటాయి. చిన్న చిన్న సంకేతాలను విస్మరించకూడదు. గుండె జబ్బులపై అవగాహన అవసరం. కొన్నిసార్లు గుండెపోటు హఠాత్తుగా ముందస్తు లక్షణాలు ఏమీ లేకుండానే రావచ్చు. కొందరికి హెచ్చరిక సంకేతాలు కనిపించవచ్చు. సంకేతాలు గురించి అవగాహన ఉండటం ఎంతో అవసరం. గుండెపోటుకు ప్రధాన కారణం గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాల్లో పూడికలు. ఆ పూడికల మీద హఠాత్తుగా రక్తం గడ్డకట్టి రక్తనాళాన్ని పూర్తిగా మూసివేసి గుండెపోటుకు దారితీస్తుంది.

– డాక్టర్‌ కొల్లూరు లక్ష్మణ్‌,

కార్డియాలజిస్ట్‌, రాజమహేంద్రవరం

మరిన్ని వార్తలు