చోరీల్లో అతని స్టయిలే వేరు!

24 Feb, 2023 23:42 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ మాధవరెడ్డి, సీఐ కొండలరావు, ఎస్సై హరీష్‌కుమార్‌
దొరికిన సొత్తులో కొంతే దోచుకుంటాడు
పట్టపగలు దొంగతనాల్లో సిద్ధహస్తుడు
మూడు కేసుల్లో రూ.6.75 లక్షల సొత్తు స్వాధీనం
అమలాపురం టౌన్‌: అందరి దొంగల్లా కాకుండా అతని చోరీ విధానంలో కొన్ని ప్రత్యేకతలను పోలీసులు గుర్తించారు. అమలాపురంలోని మూడు ఇళ్లలో పట్టపగలే చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డ కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన తంగెళ్ల సోమేష్‌ శ్రీకాంత్‌ను విచారిస్తున్నప్పుడు అతని చోరీల టెక్నిక్‌ పోలీసులకు తెలిసింది. నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. రూ.6.75 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఎస్‌సీహెచ్‌ కొండలరావు, పట్టణ ఎస్సై జి.హరీష్‌కుమార్‌ అతని చోరీల చిట్టాను వివరించారు.
బీఎస్సీ చదివి ఉద్యోగం చేస్తూ...
శ్రీకాంత్‌ బీఎస్సీ చదివాడు. మెడికల్‌ రిప్రజంటేటివ్‌ ఉద్యోగం చేస్తూనే చోరీలకు అనువైన ఇళ్లను ఎంచుకునేవాడు. ఈ చోరీల్లో దొరికిన బంగారు నగల్లో కొన్నింటినే దొంగిలించి బీరువా తలుపులు యథావిధిగా వేసేవాడు. ఆ ఇళ్ల యాజమానులు వచ్చి చూసుకుంటే పోయిన సొత్తు ఇంట్లో ఎవరో తెలుసున్న వారే చోరీ చేశారన్న అనుమానం కలిగించేలా జాగ్రత్తలు తీసుకొనేవాడు. అమలాపురంలో చేసిన మూడు చోరీల్లో శ్రీకాంత్‌ కాజేసిన రూ.6.05 లక్షల విలువైన 116.470 గ్రాముల బంగారు నగలు, రూ.70 వేల నగదును అతని నుంచి పోలీసులు రికవరీ చేశారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ శ్రీకాంత్‌ తన ఉద్యోగాన్ని తన చోరీలకు అనువుగా ఉపయోగించుకున్నాడు. కాకినాడ టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇతనిపై నాలుగు చోరీ కేసులు ఉన్నాయి. ఈ చోరీలు కూడా పట్టపగలే చేశాడు. ఈ నాలుగు కేసుల్లోనూ నాలుగుసార్లు జైళ్లకు వెళ్లి శిక్షలు అనుభవించాడు.
ఎస్పీ అభినందన
ఈ చోరీ కేసులను త్వరితగతిన ఛేదించిన పట్టణ ఎస్సై హరీష్‌కుమార్‌, సీసీఎస్‌ ఏఎస్‌ఐ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు గుబ్బల సాయి, లంకాడి శ్రీను, రేవు ప్రసాద్‌, అరిగెల శుభాకర్‌, బొక్కా ప్రసాద్‌, క్లూస్‌ టీమ్‌ ఎస్‌ఐ ఐ.ప్రవీణ్‌, హెచ్‌సీ శ్రీనును జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ మాధవరెడ్డి, సీఐ కొండలరావు అభినందించారు.
మరిన్ని వార్తలు