81 ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు

19 Mar, 2023 02:20 IST|Sakshi

కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/అమలాపురం టౌన్‌: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 140 కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రాంతీయ ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారి (ఆర్‌ఐఓ) ఎన్‌ఎస్‌వీఎల్‌ నరసింహం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జరిగిన సెకండియర్‌ ఇంగ్లిషు పరీక్షకు జనరల్‌ విభాగంలో 40,364 మందికి గాను 39,119 మంది విద్యార్థులు హాజరయ్యారని, 1,245 మంది పరీక్ష రాయలేదని తెలిపారు. అలాగే ఒకేషనల్‌ విభాగంలో 4,638 మందికి గాను 4,384 మంది హాజరయ్యారని, 254 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 81 పరీక్షా కేంద్రాల్లో స్క్వాడ్‌లు తనిఖీ చేశాయని, ఒక మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదైందని తెలిపారు. విద్యార్థుల రైటింగ్‌ ప్యాడ్స్‌పై సబ్జెక్టుకు సంబంధించిన, ఇతర రాతలు ఉంటే అనుమతించబోమని నరసింహం స్పష్టం చేశారు.

లోక్‌ అదాలత్‌లో రూ.73.33 లక్షల నష్టపరిహారం అందజేత

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో శనివారం నిర్వహించిన స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లో బాధితులకు రూ.73.33 లక్షల పరిహారం అందించారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల ప్రాంతాల్లో లోక్‌ అదాలత్‌ 31 బెంచ్‌లు ఏర్పాటు చేసి, ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. కోర్టులో పెండింగ్‌ ఉన్న కుటుంబ తగాదాలు, వినియోగదారులు, పాక్షిక న్యాయ అధికార సంస్థల్లో పెండింగ్‌ ఉన్న మేధోసంపత్తి హక్కుల తదితర 38 కేసులను ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు.

>
మరిన్ని వార్తలు