సుంద‘రుడా’యే లక్ష్యం..

19 Mar, 2023 02:20 IST|Sakshi
కొవ్వూరులో గోదావరి రివర్యు పాయింట్‌ (నమూనా)

రూ.18 కోట్లతో అభివృద్ధి

పనులకు ప్రణాళికలు

కోరుకొండ వద్ద ఆర్‌టీ సీ

బస్టాండ్‌ సుందరీకరణ

బలభద్రపురంలో వాకింగ్‌

ట్రాక్‌ నిర్మాణం

రుడా బోర్డ్‌ మీటింగ్‌లో వివిధ

పనులకు ఆమోదం

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (రుడా) పరిధిలో సుందరీకరణ, పలు రకాల అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది. రూ.18 కోట్ల బడ్జెట్‌ అంచనాలతో భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. ఇందుకు శనివారం స్థానిక రుడా కార్యాలయ సమావేశ మందిరంలో రుడా నాలుగో బోర్డ్‌ సమావేశం వేదికై ంది. ప్రజా ప్రయోజనం, ఆరోగ్య రక్షణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పే పనులకు బోర్డు ప్రాధాన్యం ఇస్తోంది. రుడా చైర్‌పర్సన్‌ షర్మిలా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత బోర్డు మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సభ్యులు చర్చించారు. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. తాజాగా రూ.18 కోట్ల పనులను ప్రతిపాదించగా బోర్డు ఆమోదముద్ర వేసింది. త్వరలో టెండర్లు ఆహ్వానించి పనులు పట్టాలెక్కించేందుకు కృషి చేస్తామని షర్మిలా రెడ్డి తెలిపారు.

బోర్డు ఆమోదించిన పనులను పరిశీలిస్తే..

● రుడా పరిధిలో నిర్వహించే పనుల్లో పట్టణాల సుందరీకరణ, వాకింగ్‌ ట్రాక్‌లు, రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్‌ బాడీ, బీచ్‌ ఫ్రంట్‌ నిర్వహణ లాంటి పనులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

● అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో రూ.1.50 కోట్లతో వాకింగ్‌ ట్రాక్‌, రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్‌ బాడీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

● కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం వద్ద వార్ఫ్‌ రోడ్డు వద్ద రూ.1.50 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ పనులకు మార్గం సుగమమైంది. దీంతో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు.

● నిడదవోలు మున్సిపాలిటీలోని చిన్న కాశీ రేవు నుంచి గూడెం గేటు వరకు రహదారి నిర్మాణానికి రూ.కోటి వెచ్చించనున్నారు.

● గోష్పాద క్షేత్రం సమీపంలోని కొవ్వూరు కట్ట వెంబడి రివర్‌ ఫ్రంట్‌ ప్రాంతం అభివృద్ధి చేపట్టి భక్తులకు స్వాంతన కలిగించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు గాను రూ.1.25 కోట్లు ఖర్చు చేయనున్నారు.

● రుడా ఏర్పడి ఏడాది దాటినా నేటికీ సొంత కార్యాలయం లేదు. రూ.10 కోట్లతో రుడా కార్యాలయ నిర్మాణానికి బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

● విమాన ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు వెంబడి ఉన్న సెంట్రల్‌ లైటెనింగ్‌ పోల్స్‌కు ఎల్‌ఈడీ మోటిఫ్‌ ఏర్పాటుకు రూ.75 లక్షలు వెచ్చించనున్నారు.

● రూ.2 కోట్లతో కోరుకొండ జంక్షన్‌ వద్ద ఆర్టీసీ బస్‌స్టాప్‌ పునరుద్ధరణ, సుందరీకరణ, వసతుల కల్పనకు బోర్డు ఆమోదం తెలిపింది.

భవన నిర్మాణాలకు అనుమతులు

రుడా పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటి వరకు 5,068 దరఖాస్తులు రాగా 4,679 ఆమోదించారు. టీఎల్‌పీలో 99 దరఖాస్తులకు 59 ఆమోదించారు. ఎఫ్‌ఎల్‌పీలో 50కు గాను, 45, ఎల్‌డీసీసీ కింద 52 గాను 33 ఆమోదించినట్లు బోర్డు వెల్లడించింది. భవన నిర్మాణ అనుమతులకు 443 దరఖాస్తులు రాగా 212 ఆమోదించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ 2020 కింద 3,520 రాగా, 624 ఆమోదించారు. తద్వారా రూ.1196.47 లక్షల ఆదాయం వచ్చింది. సమావేశంలో రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ జై సూరజ్‌ కుమార్‌, రుడా సెక్రటరీ శైలజ, టూరిజం డివిజనల్‌ మేనేజర్‌ స్వామి నాయుడు , జిల్లా పరిశ్రమల అధికారి కే.వెంకటేశ్వరరావు, డీపీఓ జగదాంబ, రుడా ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌. శ్రీనివాస్‌, రుడా అడ్మినిస్టేషన్‌ ఆఫీసర్‌ జి.శ్రావణ్‌ కుమార్‌, రుడా ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ టి.చంద్రశేఖర్‌, రుడా జేపీఓ కె.రాజకుమారి, ఏఈ దుర్గ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మకంగా పనుల నిర్వహణ

రుడా పరిధిలో చేపట్టే పనులు ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పించే దిశగా ‘రాజమహేంద్రవరంలో జగనన్న ఉమెన్‌ సేఫ్‌ హెవెన్‌’ కేంద్రం నిర్మించాం. పుష్కర ఘాట్‌లో మహిళలు దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశాం. హేవలాక్‌ బ్రిడ్జిని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరిచాం. రుడా పరిధిలోని నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల నుంచి అభివృద్ధి పనుల వివరాలను సేకరిస్తున్నాం. రుడా పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాలను రుడాలో విలీనం చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యర్థనల మేరకు గ్రామాలను కలిపాం.

– మేడపాటి షర్మిలారెడ్డి, చైర్‌పర్సన్‌, రుడా

తాగునీటి సమస్యకు పరిష్కారం

రుడా పరిధి మరింత విస్తరించిన నేపథ్యంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రాజమహేంద్రవరం నగర పరిధిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తాం. ఆల్కాట్‌ గార్డెన్‌ పాత పైప్‌ లైన్‌ స్థానంలో రూ.2 కోట్లతో పైప్‌ లైన్‌ నిర్మాణం చేపడుతున్నాం. ఇంటి పన్నులు చెల్లించాల్సిన వారు మార్చి 31వ తేదీ లోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తాం.

– కె.దినేష్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు