పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా సన్నాహాలు

19 Mar, 2023 02:20 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న డీఆర్‌ఓ నరసింహులు తదితరులు

126 పరీక్షా కేంద్రాలలో నిర్వహణ

ఏర్పాట్లపై చర్చించిన అధికారులు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం సిటీ): జిల్లాలో పదవ తరగతి రెగ్యులర్‌ పరీక్షలను 126 కేంద్రాలలో నిర్వహించనున్నారు. 29 కేంద్రాలలో ఓపెన్‌ సెకండరీ స్కూల్‌ కోర్స్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు జిల్లా విద్యా అధికారి ఎస్‌. అబ్రహంతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు సహకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన కోరారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించే సమయంలో బాలురు, బాలికలకు విడివిడిగా తనిఖీలు నిర్వహించాలన్నారు. బాలికలకు ప్రత్యేక గదిలో మహిళా పోలీస్‌ సిబ్బంది మాత్రమే తనిఖీ చేయాలన్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా ‘సి‘ సెంటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చూడాలన్నారు. మెడికల్‌ బృందాలను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. పరీక్షా కేంద్రాల రూట్‌లలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బీ సెంటర్లకు ఆర్టీసి బస్సులు నడపాలని పేర్కొన్నారు. హాల్‌ టికెట్‌ చూపించిన విద్యార్థులకు ఉచితంగా ప్రయాణించడానికి అనుమతి ఇస్తామన్నారు. ఉదయం 7గంటల నుంచి ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. మారుమూల ప్రాంతాల్లోని కేంద్రాలకు ప్రైవేటు ఆటోలు తిరిగేలా చూడాలని ఆర్టీవోకు సూచించారు.

గంట ముందే అనుమతి

డీఈఓ అబ్రహం మాట్లాడుతూ సుమారు 26 వేల మంది రెగ్యులర్‌ పరీక్షలను రాయనున్నారని చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 2,092 మంది విద్యార్థులకు ఓపెన్‌ స్కూల్‌ పదవ తరగతి పరీక్షను కోసం ఏడు కేంద్రాలలో నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు గంట ముందే పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తామన్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ కోసం తొమ్మిది వాహనాలను, ప్రశ్న పత్రాల తరలింపునకు తొమ్మిది క్లోజ్డ్‌ వాహనాలు అవసరమని రవాణా శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జెరాక్స్‌ షాపులు, ఇంటర్నెట్‌ కేంద్రాలు, బడ్డి షాపులను పరీక్ష సమయంలో మూసివేయిస్తామన్నారు. పోలీస్‌, రెవెన్యూ, విద్య, విద్యుత్‌, ట్రెజరీ, వైద్య ఆరోగ్య, మునిసిపల్‌, పంచాయతీ రాజ్‌, పోస్టల్‌, ఆర్టీసి, రవాణా, సమాచార, సార్వత్రిక విద్య పీఠం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు