ఏప్రిల్‌ 30 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు

19 Mar, 2023 02:20 IST|Sakshi

మే 1న స్వామివారి వార్షిక కల్యాణం

అన్నవరం: రత్నగిరిపై కొలువైన వీరవేంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలు ఏప్రిల్‌ 30 నుంచి మే 6 వరకూ నిర్వహించాలని శనివారం జరిగిన దేవస్థానం పండితులు, అధికారుల సమావేశంలో నిర్ణయించారు. మే 1వ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ అజాద్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారుల కృషి చేయాలన్నారు. పలు విభాగాల అధికారులు చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. వచ్చే నెలలో మరో సారి సమావేశం నిర్వహిస్తామని ఆ రోజుకు అధికారులు తమ ప్రణాళికలతో హాజరు కావాలని ఈఓ ఆదేశించారు.

కౌలుదారు నుంచి 4.25 ఎకరాల భూమి స్వాధీనం

ఆరెంపూడి గ్రామంలో అన్నవరం దేవస్థానానికి చెందిన 4.25 ఎకరాల భూమిని కౌలుదారు నుంచి శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి కౌలు నాలుగేళ్ల క్రితమే ముగిసింది. అయినప్పటికీ కౌలుదారు దేవస్థానానికి భూమిని స్వాధీనం చేయలేదు. దీంతో దేవస్థానం సిబ్బంది శనివారం ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌ ఈ భూమిని పరిశీలించారు.

మరో రెండ్రోజులు ఇన్‌చార్జి ఈఓగా అజాద్‌

రత్నగిరి దేవస్థానం ఈఓ ఎన్‌వీ సత్యనారాయణ మూర్తి తన సెలవును సోమవారం వరకు పొడిగించారు. దీంతో ఇన్‌చార్జి ఈఓగా మరో రెండు రోజులు బాధ్యతలు నిర్వహించాలని చంద్రశేఖర్‌ అజాద్‌ను దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు