పదే పదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్టు

19 Mar, 2023 02:20 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఈబీ ఏఈఎస్‌ మార్గాని రాంబాబు

రాజమహేంద్రవరం రూరల్‌: రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు పదే పదే నేరాలకు పాల్పడే సారా అమ్మకందారులు, సరఫరాదారులు, తయారీదారులపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపుతున్నామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ మార్గాని రాంబాబు తెలిపారు. శనివారం రాత్రి స్థానిక లాలాచెరువులోని ఎస్‌ఈబీ సౌత్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ 33 పీడీ యాక్టు కేసులు నమోదు చేశామన్నారు. ఎస్‌ఈబీ సౌత్‌ స్టేషన్‌ పరిధిలో 15, నార్త్‌ స్టేషన్‌లో ఏడు, కోరుకొండ స్టేషన్‌లో ఐదు, రంగంపేట స్టేషన్‌లో మూడు, దేవరపల్లి స్టేషన్‌లో రెండు, కొవ్వూరు స్టేషన్‌ పరిధిలో ఒకటి నమోదు చేశామని అన్నారు. జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారి పిట్టా సోమశేఖర్‌ ఆధ్వర్యంలో గడిచిన మూడు నెలల్లో జిల్లాలో సారా ఇతర మత్తు పదార్థాలపై దాడులు జరిపామన్నారు. ఇందులో 313 కేసులు నమోదు చేసి, 402 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. 28 వాహనాలను సీజ్‌ చేసి 2820 లీటర్ల సారా, 694 కిలోల బెల్లం, 471.75 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. 31,450 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. మత్తు పదార్థాలు, సారా అమ్మకాలు సమాచారం ఎవరికై నా తెలిస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 14500కు తెలపాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్లు పీవీ రమణ, పి.హనుశ్రీ, జి.వెంకటలక్ష్మి, ఎస్సై ఎం.రామశేషయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు