వైఎస్సార్‌ సీపీ నేత భవానీశంకర్‌ హత్య

10 May, 2023 10:03 IST|Sakshi

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సంజీవ్‌నగర్‌లో పాతకక్షల నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు బూరాడ భవానీశంకర్‌(58) మంగళవారం హత్యకు గురయ్యారు. ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌ కథనం ప్రకారం.. సీటీఆర్‌ఐ పనసచెట్టు సమీపంలోని సంజీవ్‌నగర్‌కు చెందిన బూరాడ భవానీశంకర్‌, అతని భార్య కృష్ణమాధురి ఒక వేడుకకు హాజరై తిరిగి 3.30: గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. భవానీశంకర్‌ మేడపైన హాలులో కూర్చుని భోజనం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన పీటా అజయ్‌ అక్కడకు వచ్చాడు. ఏదో మాట్లాడే పని ఉందని చెప్పాడు.

సరే భోజనం చేసి కిందకు వస్తానని అతనితో చెప్పాడు. ఇంతలో భవానీశంకర్‌ భోజనం చేస్తుండగా అజయ్‌ పైకి వచ్చాడు. ఆ సమయంలో అజయ్‌ తన వెనుక దాచుకుని ఉన్న కత్తిని చూసి భవానీశంకర్‌ భార్య గట్టిగా కేకలు వేశారు. ఈ లోపు తనతో వెంట తెచ్చుకున్న కత్తిని తీసి కడుపులో మూడుసార్లు పొడిచి, పరారు అయ్యాడు. గాయాలపాలైన భవానీశంకర్‌ను వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందారు. విషయం తెలిసిన ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.

హత్య జరిగిన వివరాలను కుటుంబ సభ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ హత్య పాత కక్షల నేపథ్యంలో జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు గురైన భవానీశంకర్‌ వైఎస్సార్‌ సీపీ 44 వార్డు ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ సేకరించిన పోలీసులు హత్య చేసింది అజయ్‌గా గుర్తించి అతనిని అరెస్టు చేశారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఢిల్లీలో ఉన్న ఎంపీ భరత్‌రామ్‌ మృతుడి భార్య కృష్ణమాధురిని ఫోన్‌లో పరామర్శించారు.

మరిన్ని వార్తలు