వేగంగా రోడ్‌ కం రైలు వంతెన పనులు

26 Oct, 2023 23:58 IST|Sakshi
రోడ్‌ కం రైలు బ్రిడ్జిపై మరమ్మతు పనులను పరిశీలిస్తున్న ఎంపీ భరత్‌రామ్‌

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ఉభయ గోదావరి జిల్లాలకు అనుసంధానమై ప్రాధాన్యం గల రోడ్డు కం రైలుబ్రిడ్జి (ఆర్‌ అండ్‌ ఆర్‌) పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్‌, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం రోడ్‌ కం రైలు బ్రిడ్జి ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని ఎంపీ భరత్‌ సమగ్రంగా సమీక్షించారు. ఆర్‌అండ్‌ బీ అధికారులతో చర్చించారు. బ్రిడ్జిపై గతంలో ఉన్న ప్యాచ్‌ వర్క్స్‌, థర్టీ, ఎయిటీ ఎంఎం లేయర్స్‌ను పూర్తిగా తొలగించి.. గట్టి బేస్‌ను టచ్‌ చేస్తూ 30 ఎంఎం బీటీ రోడ్డును ఒక వైపు పూర్తి చేశారు. మరో వైపు కూడా రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఎంపీకి తెలిపారు. క్రోకోడయల్‌ జాయింట్స్‌, రైలింగ్‌, పుట్‌ పాత్‌, గెడ్డర్స్‌ ఏర్పాటు తదితర పనులన్నీ నవంబరు నాలుగైదు తేదీల నాటికి పూర్తి చేస్తామని ఎంపీ భరత్‌కు ఆర్‌ అండ్‌ బీ అధికారులు వివరించారు. పనులన్నిటినీ పరిశీలించిన అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతమైన పనులు చేస్తుండటం వల్ల నిర్ణీత కాలం కంటే కాస్త ఆలస్యమవుతోందని, మరో పది రోజుల్లో పనులు పూర్తవుతాయని ఆర్‌ అండ్‌ బీ అధికారులు చెబుతున్నారని అన్నారు. ఆర్‌అండ్‌ బీ వంతెన నిర్మాణ పనుల వల్ల మరో పది సంవత్సరాల పాటు ఈ వంతెన ప్రజల వినియోగానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మించి అరవై సంవత్సరాలు అవుతోందన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నుంచి కూడా రూ.32 కోట్లు మంజూరు అయ్యాయని, వాటితో రైల్వే శాఖ వంతెన అభివృద్ధి పనులు త్వరలో చేపట్టబోతోందని తెలిపారు. వందే భారత్‌ రైళ్లు, భవిష్యత్తులో బుల్లెట్‌ ట్రైన్లు రాబోతున్న దృష్ట్యా గోదావరి నదిపై మరో వంతెన అవసరం, విజయవాడ–విశాఖ థర్డ్‌ లైన్‌ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు వివరంగా తెలియజేశానని, ప్రతిపాదనలు కూడా అందజేసినట్టు తెలిపారు. ఆర్క్‌ బ్రిడ్జిపై మరో లైన్‌ ఏర్పాటుకు రైల్వే శాఖ యోచిస్తోందన్నారు. రోడ్‌ కం రైలు బ్రిడ్జిని ఆనుకుని కొత్త వంతెనకు సంబంధించి డీపీఆర్‌ సిద్ధమైందని, 4 కిలోమీటర్ల మేర రూ.4,500 కోట్లతో కొత్త బ్రిడ్జి రాబోతోందని ఎంపీ భరత్‌ వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ డీఈఈ మధుసూదన్‌రావు, ఏఈఈ సీహెచ్‌ సత్యమాధవి, నగర వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, నగర మహిళా అధ్యక్షరాలు మార్తి లక్ష్మి, మాజీ కార్పొరేటర్‌ ఏవీ రమణ, ఎన్వీ శ్రీనివాస్‌, పీతా రామకృష్ణ, దుర్వాసల సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎంపీ భరత్‌రామ్‌

మరిన్ని వార్తలు