గట్టెక్కించారు

18 Nov, 2023 01:46 IST|Sakshi

సాక్షి, అమలాపురం: ఈ ఏడాది నైరుతితో పాటు ఈశాన్యం కూడా ముఖం చాటేసింది. అడపాదడపా వర్షాలు కురిసినా జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ లోటు వర్షపాతమే. మరోవైపు జూలై తప్ప మిగిలిన నెలల్లో గోదావరిలో వరద జాడే లేదు. అయినప్పటికీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం దిగువన ఉన్న ఎత్తిపోతల పథకాల నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ అందరికీ గోదావరి నీరే శరణ్యమైంది. వర్షాలు తగినంతగా కురవకపోవడంతో ఇవ్వాల్సిన నీటికన్నా అదనంగా అందించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా గోదావరి డెల్టా ఆయకట్టుకు అదనంగా నీరు ఇవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేసి ఖరీఫ్‌ను ఎట్టకేలకు గట్టెక్కించారు.

వరుణుడు ముఖం చాటేసినా..

రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరొందిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు వంతులు పైగా ఆయకట్టు గోదావరి డెల్టాలోనే ఉంది. ఇక్కడ ఈ ఖరీఫ్‌లో వరికోతలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. ఈ ఏడాది వర్షాలు తగినంతగా కురవనప్పటికీ అధిక దిగుబడులు వస్తూండటం విశేషం. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి డెల్టా కాలువల కింద సుమారు 3.90 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ వరి సాగు జరుగుతోంది. ఇక్కడ సగటున 34 బస్తాల (బస్తా 75 కేజీలు) నుంచి 48 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తోంది. డెల్టా ఎగువన, దిగువన ఎకరాకు సగటు 39 బస్తాలు అనుకుంటే ఈ మూడు జిల్లాల్లో కలిపి ఒక్క డెల్టా ఆయకట్టులో 11.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోందని అంచనా.

అంతకు మించి..

సాధారణంగా గోదావరి డెల్టాలో ఒక టీఎంసీతో సుమారు 10,800 ఎకరాలు సాగు చేయవచ్చు. రబీలో 90 టీఎంసీల లభ్యత ఉంటే ఎద్దడి లేకుండా సాగునీరు సరఫరా అందిస్తారు. ఖరీఫ్‌లో మాత్రం సాగు అధికంగా ఉన్నందున కనీసం 110 టీఎంసీల నీటి సరఫరాకు అధికారులు చర్యలు తీసుకుంటారు. మరీ వర్షాభావ పరిస్థితులు తలెత్తితే కనీసం 125 టీఎంసీల నీరు అందిస్తారు. కానీ ఈసారి అంతకు మించి అసాధారణంగా మూడు డెల్టాలకూ కలిపి ఖరీఫ్‌ షెడ్యూలు ముగిసిన ఈ నెల 15వ తేదీ వరకూ ఏకంగా 156.614 టీఎంసీల నీటిని సరఫరా చేయడం విశేషం.

3 వేల టీఎంసీలే

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఈ ఏడాది ఇన్‌ఫ్లో తక్కువగా నమోదైన విషయం తెలిసిందే. జూలైలో వరద వచ్చినప్పటికీ ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఆ జాడే లేదు. జూన్‌ ఒకటో తేదీ నుంచి శుక్రవారం వరకూ గోదావరిలో మొత్తం 2,958.08 టీఎంసీల మేర జలాలు నమోదు కావడం గమనార్హం. డెల్టా పంట కాలువలకు 157.284 టీఎంసీల నీరు విడుదల చేయగా, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,795.256 టీఎంసీల నీరు విడిచిపెట్టారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 7 వేల క్యూసెక్కులు కాగా, దీనిలో సీలేరు పవర్‌ జనరేషన్‌ నుంచి 3,666 క్యూసెక్కులు వస్తున్నాయి. సహజ జలాలు 3,334 క్యూసెక్కులు మాత్రమే ఉన్నాయి. వరి కోతలు ఆరంభమైనందున ఇటీవల నీటి విడుదలను తగ్గించిన అధికారులు.. ముందస్తు రబీ ప్రోత్సాహంలో భాగంగా నీటి విడుదలను మళ్లీ పెంచారు.

మరిన్ని వార్తలు