సమగ్ర కుల గణనకు అడుగులు శుభపరిణామం

18 Nov, 2023 01:46 IST|Sakshi

సమగ్ర కుల గణనకు అడుగులు

శుభపరిణామం

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో

మేధావులు, వక్తలు

సీటీఆర్‌ఐ/రాజమహేంద్రవరం సిటీ: ‘కులగణన చారిత్రాత్మక నిర్ణయం.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటిన అనంతరం సమగ్ర గణనకు ప్రభుత్వం అడుగులు వేయడం శుభపరిణామం. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహద పడుతుంది. సమ సమాజ స్థాపన కోసం ముందుకు అడుగులు వేయడం సాహసంతో కూడిన అంశం. గణన సమగ్రంగా, పారదర్శకంగా చేపట్టి అన్ని వర్గాల అభ్యున్నతికి నాంది పలకాలి.’ అని వివిధ కులాల మేధావులు, వక్తలు అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణనకు సంబంధించి అన్ని వర్గాల ప్రజల సలహాలు, సూచనలు తీసుకునేందుకు స్థానిక మంజీరా కన్వెన్షన్‌లో కలెక్టర్‌ కె.మాధవీలత శుక్రవారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన 56 బీసీ కులాల సంఘం నాయకులు, మూడు ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మిగిలిన సంఘాలకు చెందిన సుమారు 400 మంది ప్రతినిధులు, మేధావులు, ప్రజలు హాజరయ్యారు. గణనపై తమ సలహాలు, సూచనలు ఇచ్చారు. వాటిని విన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ , కలెక్టర్‌ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గణన సమయంలో తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జేసీ తేజ్‌ భరత్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, వైఎస్సార్‌ సీపీ సిటీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, ఆర్‌డీఓ చైత్రవర్షిణి, కొవ్వూరు ఆర్‌డీఓ మల్లిబాబు, రాష్ట్ర గాండ్ల, తెలికల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సంకిస భవానీప్రియ, ఎంబీసీ చైర్మన్‌ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు