మతం – అభిమతం

15 Apr, 2021 00:17 IST|Sakshi

మత మార్పిడుల వ్యవహారం మన దేశంలో తరచు వివాదాస్పదమవుతోంది. ఈమధ్య కాలంలో బీజేపీ ఏలుబడిలోని మూడు రాష్ట్రాలు–ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లు మత మార్పిడుల నిరోధానికి ఆర్డినెన్సులు, చట్టాలు తీసుకొచ్చాయి. తాము అధికారంలోకొస్తే అలాంటి చట్టాన్ని తీసుకొస్తామని తమిళనాడులో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైనవి. బెదిరింపులు, వేధింపులు, మభ్యపెట్టడం ద్వారా దేశంలో కొందరు మత మార్పిడులకు పాల్పడుతున్నారని వీటిని నియంత్రించటానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం తమ ముందుకొచ్చినప్పుడు ధర్మాసనం కటువైన వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్లకు పైబడిన వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఎంపిక చేసుకోవటాన్ని ఎందుకు నిరోధించాలని జస్టిస్‌ ఆర్‌ ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు ప్రజా ప్రయోజనానికి చాలా చాలా హాని కలిగించేవని, ఈ పిటిషన్‌ ప్రచార ప్రయోజన వ్యాజ్యం తప్ప మరేమీ కాదని దుయ్యబట్టింది. చివరకు పిటిషనర్‌ ఆ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. మన రాజ్యాంగంలోని 25వ అధికరణ ఏ మతాన్నయినా స్వేచ్ఛగా అవలంబించటానికి, ప్రచారం చేసుకోవటానికి అనుమతినిస్తోంది. అయితే శాంతిభద్రతలకు, నైతికతకు, ప్రజల ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా ఈ హక్కును వినియోగించుకోవచ్చునని నిర్దేశిస్తోంది. మతాన్ని కించపరచ డానికి ప్రయత్నించటం, వేరే మతస్తుల మనోభావాలను దెబ్బతీయటం వగైరాలకింద చర్యలు తీసుకోవటానికి వీలు కల్పిస్తున్న భారతీయ శిక్షాస్మృతిలోని 295ఏ, 298 సెక్షన్లను బలవంతపు మతమార్పిడి జరిగిందని అనుమానం వచ్చిన సందర్భాల్లో వినియోగిస్తున్నారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా పదేళ్లక్రితం చట్టాలు చేసిన రాష్ట్రాలు సైతం అందుకు సంబంధించి నిబంధనలు రూపొందించటంలో అయోమయం తలెత్తటం వల్ల వాటిని నిలిపివుంచాయి. ఈ మధ్య ఉత్తరప్రదేశ్‌ ‘వివాహం కోసం మతం మారటాన్ని’ నిషేధిస్తూ ఆర్డినెన్సు తీసుకొచ్చింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు విచారణలో వున్నాయి. 

మతమార్పిడులు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కలగజేసి, అలాంటి ప్రచారం ద్వారా లబ్ధి పొందేందుకు రాజకీయ నాయకులు వెరవడం లేదు. ఈ ధోరణి సామాన్య పౌరులకు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతున్నదో చెప్పడానికి ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఉదంతమే ఉదాహరణ. క్రైస్తవ సన్యాసినులతో కలిసి ఇద్దరు యువతులు రైల్లో వెళ్తుండగా, వారితోపాటే ప్రయాణిస్తున్న ఒక గుంపు వారిని శంకించింది.  బలవంతంగా మత మార్పిడి చేయించటానికే ఆ ఇద్దరు యువతులనూ తీసుకెళ్తున్నారన్న అభిప్రాయం వారికేర్పడింది. దాంతో రైలు ఆగిపోయింది. అక్కడికక్కడ ‘విచారణ’ మొదలైపోయింది. తాము మతం మారడంలేదని, తాము కూడా పుట్టుకతో ఆ మతానికే చెందినవారమని యువతులు చెబుతున్నా ఎవరూ వినిపించుకోలేదు. వెంటనే పోలీ సులు రావటం, వారిని ప్రశ్నించటం కోసం పోలీస్‌స్టేషన్‌కు తరలించడం పూర్తయింది. ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. కానీ ప్రయాణం వాయిదా పడింది. సహ ప్రయాణికులకు ఇబ్బంది కలి గించటం, రైల్లో నేరానికి పాల్పడటం, టిక్కెట్‌ లేకుండా ప్రయాణించటంతోసహా ఎన్నో కారణాలు రైల్లోనుంచి దింపేయటానికి దారితీయడం ఎప్పటినుంచో వింటున్నదే. కానీ మత మార్పిడి అనుమానం కలిగినా ప్రయాణం ఆగిపోతుందని ఝాన్సీ ఉదంతం నిరూపించింది. నిజానికి మత మార్పిడులకు సంబంధించిన చర్చ చాలా పాతది. 1954లోనే మత మార్పిడులను క్రమబద్ధీకరించే బిల్లును పార్లమెంటు పరిశీలించింది. అలాగే 1960లో వెనకబడిన వర్గాల(మత పరిరక్షణ) బిల్లు ముసాయిదా సైతం రూపొందింది. అయితే ఆ రెండూ అంతకన్నా ముందుకు పోలేదు. 1967లో ఒరిస్సా మత స్వేచ్ఛ చట్టం తీసుకొచ్చినా రాజ్యాంగంలోని 25వ అధికరణ స్ఫూర్తికి అది విరుద్ధమని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. అయితే వేరొకరిని తన మతంలోకి మార్చే హక్కు ఎవరికీ వుండబోదని, అది రాజ్యాంగంలోని 25వ అధికరణకిందకు రాదని 1977లో ఒక కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘మత స్వేచ్ఛకు రాజ్యాంగమే పూచీపడుతున్నప్పుడు ఆ విషయంపై రాజ్యం ఆందోళన చెందాల్సిన అవసరమేమిటి?’ అని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ ప్రశ్నించారు.
 
ఒక పార్టీ గుర్తుపై ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వేరే పార్టీలోకి ఫిరాయిస్తే అది తప్పని, ప్రజా భీష్టానికి విరుద్ధమని... అంతిమంగా ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయని గుర్తిం చనివారికి కూడా ఎవరైనా మతం మార్చుకుంటే అభ్యంతరం అనిపిస్తోంది. అందువల్ల ఏదో అయిపోతుందనే భయం కలుగుతోంది. రాజకీయ స్వప్రయోజనాలే ఇందుకు కారణమని సులభం గానే చెప్పొచ్చు.  తమను బలవంతంగా మతం మార్చారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వేరు. కానీ ఎలాంటి సమస్య తలెత్తకుండా వివాదాన్ని రేకెత్తించటానికి చూడటం సరికాదు. తోటి పౌరుల వ్యక్తిగత నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోరాదన్న స్పృహ అందరిలో కలగవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు తీర్పు గుర్తుచేస్తోంది. ఈ అంశంపై మన దేశంలో తరచు తలెత్తుతున్న వివాదాలకు ధర్మాసనం వ్యాఖ్యలు ముగింపు పలుకుతాయని ఆశించాలి.
 

మరిన్ని వార్తలు