ఈ మరణంతోనైనా వ్యవస్థలు మేల్కొనాలి

13 Jul, 2021 00:26 IST|Sakshi
స్టాన్‌ స్వామి (ఫైల్‌)

‘‘చాలాకాలంగా ఆదివాసీల జీవన హక్కుల కోసం పోరాడుతున్న 84 ఏళ్ల వృద్ధుడు ఫాదరీ స్టాన్‌ స్వామిపై కేంద్ర ప్రభుత్వం అభియోగాలు మోపి విచారణ లేకుండా జైళ్లలో  నిర్భంధించి, బెయిల్‌ నిరాకరించడమే కాక కోర్టు కస్టడీలో ఉండగానే అనారోగ్య పరిస్థితులలో సహితం వైద్య సదుపాయం నిరాకరించిన ఫలితంగా మరణించడానికి బాధ్యురాలు ప్రభుత్వమే. స్వామి మరణం... దేశీయ పాలనావ్యవస్థలు ఒక క్రమ పద్ధతిలో అమలు జరుపుతున్న నిరంకుశ చర్యల ఫలితం. దేశ పౌరుల, మేధావుల, అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తి చాటే విద్యార్థులపైన, భిన్నాభిప్రాయ వ్యక్తీకరణలపైన స్పందించడంలో న్యాయవ్యవస్థల తాత్సారానికి అనేక ఉదాహరణలున్నాయి. ఇంతకన్నా పెద్ద వక్రోక్తి స్టాన్‌ స్వామి ఆరోగ్యం కోర్టు కస్టడీలో జైల్లోనే క్షీణిస్తున్నప్పటికీ ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించబోవడం. కోర్టు కస్టడీలో ఉండగానే స్వామి విషాద మరణంతోనైనా నేర న్యాయ వ్యవస్థతో, న్యాయవ్యవస్థలో, పాలకుల్లో చట్టాలను చదవడంలో అన్వయించడంలో ఒక కుదుపు రాగలదని ఆశిద్దాం.
- సుప్రసిద్ధ జాతీయ దినపత్రికల సంపాదకీయాలు (7-7-21)

‘‘నాకు ఊపిరాడటం లేదు (ఐ కాంట్‌ బ్రీత్‌) అది 2014లో తెల్లవాడైన న్యూయార్క్‌సిటీ పోలీస్‌ ఆఫీసర్‌ ఒకడు నల్లవాడైన ఎరిక్‌ గార్నర్‌ పీకమీద కాలుపెట్టి తొక్కిన సందర్భంగా గార్నర్‌ అరుస్తూ అన్నమాట అది! ఆ దుర్ఘటన మొదలు, అమెరికాలోని దళిత నల్ల ప్రజలందరినోట ఎరిక్‌ గార్నర్‌ మాటే దేశమంతటా ఒక పాపులర్‌ నినా దంగా మారింది. తిరిగి ఇదే అనుభవం (నాకు ఊపిరాడటంలేదు) 2020 మే 25న జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి పౌరుడి పీకమీద తెల్ల జాతి పోలీస్‌ ఆఫీసరు డెరిక్‌ ఛావిన్‌ కాలుపెట్టి తొమ్మిది నిమిషాల సేపు తొక్కేస్తున్నప్పుడు, అదీ మరో ముగ్గురు పోలీసు ఆఫీసర్లు చూస్తుండగానే, గిలగిలా కొట్టుకుంటున్నపుడు ఫ్లాయిడ్‌ నోట విన వచ్చింది! క్రమంగా యావత్తు అమెరికాలోనూ పోలీసు వ్యవస్థ నిరం కుశ ప్రవర్తలనకు నిరసనగా ‘నాకు ఊపిరాడ్డంలేదు’ అన్న నినాదం ఒక జాతీయ నిరసన ప్రకటనగా ప్రజల చేతుల్లో ఒక ఆయుధంగా మారింది. అంటే నిరంకుశ వైఖరులకు, ప్రవర్తనలకు వ్యతిరేకంగా అదొక అస్త్రంగా మారింది.

అదే నినాదం ఇప్పుడు ఖండాంతరాలు దాటి నేడు ఆదివాసీల నిరసన గళం స్టాన్‌ స్వామి గొంతులోనూ పలకవలసి వచ్చింది. కోర్టు కస్టడీలో ఉండి జైలు నిర్భంధంలో పార్కిన్‌సన్‌ వ్యాధి మూలంగా నోరు తొస్సు పోయి కేవలం హావభావాలతోనే ప్రకటించడం తప్ప, ఆడని చేతులు గ్లాసుపుచ్చుకోలేని దురవస్థలో ఉన్న స్టాన్‌ స్వామి మంచి నీళ్లు తాగడానికి కనీసం ఒక ‘స్ట్రా’ (పీల్చుకునే గొట్టం) అయినా ఇస్తే గొంతు ఆర్చుకుంటానని అధికారుల్ని ప్రాధేయపడా ల్సిన స్థితి వచ్చిందంటే, ఇంతకూ మనకున్న ప్రభుత్వాలు విచారణ సంస్థలు న్యాయ వ్యవస్థలూ ఎవరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయో ప్రశ్నించుకోవలసిన ప్రశ్న మరోసారి ఉదయిస్తోంది. నాకు ఊపిరి పోతోంది. గాలి ఆడడం లేదని అక్కడ... నాకు దప్పికవుతోంది స్ట్రా ఇచ్చి ఆదుకోమని ఇక్కడ! దళిత వర్గాలపై అక్కడా, ఇక్కడా ఖండాలు, ఖండాంతరాల మధ్య తేడా లేకుండా ఎక్కుపెట్టిన అమా నుష చట్టాలు ఒక్క సత్యాన్ని మరోసారి బోధిస్తున్నాయి.

ఎన్నికలలో గెలుపు గుర్రాలకోసం ధనస్వామ్య ప్రతినిధులకు దళితుల ఓట్లు కావాలి కాని వాళ్ల నోళ్లు మూసేయాలి– ఇదీ అసలు వ్యూహరచన. ఫాదర్‌ స్టాన్‌ స్వామి జైలులో కోర్టు కస్టడీలో ఉండగానే వైద్యం లేక అనేక ఈతిబాధలతో ఆకస్మికంగా చనిపోయిన తరువాత అంతకుముందు ఆయనకు చివరి క్షణంలో కూడా బెయిల్‌ నిరాక రించిన కోర్టు హడావుడిగా సమావేశమై ‘స్టాన్‌ స్వామి’ ఆకస్మిక మృతి పట్ల కోర్టు వినమ్రతతో నివాళులర్పిస్తోంది. మా విషాదాన్ని ప్రకటిం చడానికి మాకు మాటలు చాలవు’’ అని ప్రకటించుకుంది! భీమా కోరెగాం దళిత సభల పేరిట జరిగిన పలువురి అరెస్టులలో భాగంగా నిర్బంధంలోకి తీసుకున్న 15 మంది నిందితులు శాంతియుత ప్రజాందోళనకారులు ‘ఉగ్రవాదుల’తో సంబంధాలున్నవారూ కారు. కనుకనే అరెస్టుచేసిన ఆ 15 మందినీ వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల పరిరక్షణా సంస్థ అధిపతి మిఖా యెల్‌ బాచ్‌లెట్‌ కోరారు. ఏ ఒక్కరి అభిప్రాయ స్వేచ్ఛను, సమావేశ స్వేచ్ఛను అడ్డుకోరాదని ఇవి పౌరుల ప్రాథమిక హక్కులనీ అందుకు వారి డిటెక్షన్‌లు మార్గం కాదనీ ఆమె స్పష్టం చేశారు.

అందుకుగాను సమాచార సాంకేతిక చట్టంలోని ‘66-ఎ’ క్లాజును రద్దు చేసిన 2015 నాటి తన తీర్పును ఇంతకాలం అమలు చేయ కుండా ఉన్నందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం విస్మయం ప్రక టిస్తూ కేంద్రానికి నోటీసు ఇవ్వడం మరో కొసమెరుపు! ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చి ఆరేళ్లు గడిచిపోయినా ఆ ‘66-ఎ’ క్లాజు సెక్షన్‌ కిందనే మగ్గుతున్న 745 కేసులు ఇంకా అలా ఉండిపోయాయి. (శ్రేయసింఘాల్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం కేసులో జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌ బెంచ్‌ తీర్పు)! సుప్రసిద్ధ చరిత్రకారుడు రామ చంద్ర గుహ స్టాన్‌స్వామి మృతి న్యాయవ్యవస్థ జరిపిన హత్య, ఇందుకు కోర్టులు ఉమ్మడిగా బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు!

బహుశా అందుకనే ఆదివాసీ ప్రజలకు నీళ్లు, అటవీ సంపద, ఆదివాసీ భూముల రక్షణ కోసం 51 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతూ వచ్చిన ఫాదర్‌ స్టాన్‌స్వామిలో మూర్తీభవించి ఉన్న గొప్ప మానవతా లక్షణాలకు ‘హిందూ’ సంపాదకుడు ఎన్‌. రామ్, సుప్రీం మాజీ న్యాయమూర్తి మదన్‌లోకూర్‌ జోహారులర్పించారు! కోర్టుల ప్రాసిక్యూషన్‌ వైఖరి ‘అమానుషం’ అని వర్ణించారు!  అందరి కన్నా  మిన్నగా ఫాదర్‌ స్టాన్‌ స్వామి చనిపోయే గడియలలో చేసిన ప్రకటన మరింత ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ఇప్పటికీ మనం కలిసి కట్టుగానే బృందగానం చేద్దాం- పంజరంలో ఉన్న పక్షి చివరి క్షణం దాకా అలా గొంతెత్తి పాడుతూనే ఉంటుందని మరచిపోరాదు! ఈ సందేశాన్నే మరొకలా ఇక్కడ నల్ల మరియమ్మ మాటల్లో వినిపిస్తున్నాడు ఓ కవి. 

‘‘రెండు కాసుల కానుకిచ్చిన వృద్ధురాలు కన్నా 
ఈ దళిత మరియమ్మ బహు ‘ధనికురాలు’. 
తాను తీయని సొమ్ముకు బలవంతంగా 
తన ప్రాణం అర్పించింది!
ఈమెకు పరలోకపు మార్గం దయ చేయండి
అయిననూ మా చిత్తము కాదు తండ్రీ
ఈ లోకపు పోలీస్‌ చిత్తమే సిద్ధించుగాక..! 
ప్రభువా! ఈ పరలోకపు సమూహంలో మరియమ్మ
భూమ్మీద చిత్రపటంతో ఆమె కుమారుడు
కన్నీళ్లతో ఆమె కుమార్తె రోదిస్తూ 
ఎవరికి ఎవరి జాడా లేకుండా ఉన్నపుడు...
ప్రభుత్వం చేతిలో మాయాజాలపు 
టోపీలోంచి ఒక ఉద్యోగం మెరుపులా 
బయటకు వచ్చి కొన్ని కన్నీళ్లు తుడుస్తుంది. ఎలా..
పదిహేను లక్షల నగదు చెక్కు మీద సంతకం 
ఎర్రటి నెత్తుటి జీరతో మెరుస్తూ ఉంటుంది. 
మళ్లీ ఓట్ల వర్షం కురుస్తుంది. ఈ సారి పథకం మారి
మరో పోలీస్‌ స్టేషన్‌లో ఇంకో సువార్తమ్మ చనిపోయేదాకా 
మరియమ్మ పరిహారాన్నే వల్లెవేస్తాం! 
కాకపోతే నిందితుల పేర్లు మారుతూ ఉంటాయి. 
హతుల పేర్లతో జీవగ్రంథం నిండిపోతుంది!!’’ 
కనుకనే ఆశయాలు సంఘర్షిస్తున్న వేళ 
ఆయుధం అలీనం కాదన్న నానుడి పుట్టుకొచ్చి ఉంటోంది!!


ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు