కర్ణాటక పశు సంరక్షణ

12 Dec, 2020 00:32 IST|Sakshi

నిరసనలు, గందరగోళం మినహా చర్చేమీ లేకుండా కర్ణాటక అసెంబ్లీ బుధవారం పశు వధ నివా రణ, సంరక్షణ బిల్లును ఆమోదించింది. శాసనమండలిలో తగిన బలం లేకపోవడంతో ప్రస్తుతానికి అక్కడ వాయిదా వేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో అమలవుతున్న గోవధ నిషేధ చట్టాల పనితీరు ఎలావుందో పరిశీలించి, చట్టం తీసుకొస్తామని ఆమధ్య కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రంలో 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకొచ్చినప్పటి నుంచీ గో సంరక్షణపై సంఘ్‌ పరివార్‌ సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. గో సంరక్షణ కోసమంటూ రోడ్డెక్కే నిఘా బృందాల వల్ల పలు రాష్ట్రాల్లో సమస్యలు ఏర్పడ్డాయి. అందులో కర్ణాటక కూడా వుంది. ఇప్పుడు తాజాగా ఆమోదం పొందిన బిల్లులో ‘సదుద్దేశంతో పశు రక్షణకు పూనుకొనే వ్యక్తులను కాపాడే’ నిబంధన పొందు పరిచారు. కర్ణాటక బిల్లు కేవలం ఆవులు, దూడలు, ఎద్దులేకాక గేదెలు, దున్నపోతుల వధను కూడా నిషేధిస్తోంది. బిల్లు చట్టంగా మారాక దాన్ని ఉల్లంఘించినట్టు రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల వరకూ శిక్ష, రూ. 50,000 నుంచి ఏడు లక్షల వరకూ జరిమానా విధించేలా నిబంధనలున్నాయి. వధించే ఉద్దేశంతో పశువును విక్రయించేవారికి, ఉద్దేశపూర్వకంగా పశువును చంపినవారికి కూడా ఇందులో శిక్షలు, జరిమానాలు వున్నాయి. అలాగే పోలీసులు సోదా చేసేందుకు, పశువుల్ని స్వాధీనం చేసు కునేందుకు వీలు కల్పిస్తున్నారు. 2010లో అధికారంలో వుండగా యడ్యూరప్ప ఈమాదిరి బిల్లే రూపొందించారు. అనంతరకాలంలో ప్రభుత్వం మారడంతో అది మూలనబడింది. కర్ణాటకలో ప్రస్తుతం 1964నాటి గోసంరక్షణ చట్టం అమల్లోవుంది. చట్టాల మాటెలావున్నా పశుమాంసం ఎగుమతుల్లో ప్రపంచంలో బ్రెజిల్‌ తర్వాత స్థానం మనదే.

దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, గోవా, ఈశాన్య రాష్ట్రాలు మినహా  మిగిలిన రాష్ట్రాల్లో పశు వధ నిషేధ చట్టాలు అమల్లోవున్నాయి. దేశమంతా వర్తించే విధంగా గోవధ నిషేధ చట్టం తీసుకురావాలన్న ప్రయత్నాన్ని 1955లో అప్పటి ప్రధాని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ అంశం రాష్ట్రాలకే విడిచిపెట్టడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సైతం ఆవు, దూడ, ఎద్దు వగైరాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, వాటి వధను నివారించాలని వుంది. నిరుపయోగంగా మారిన పశువుల్ని  కబేళాలకు తరలించరా దన్న వాదన తప్పని 1961లో ఒక కేసులో తీర్పునిచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. అందువల్ల ఆ పశు యజమానులకే కాక, మొత్తం సమాజంపై భారం పడే ప్రమాదం వుంటుందని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌ చట్టం అమలు తీరెలావుందో పరిశీలిస్తామని కర్ణాటక తెలిపింది గనుక ఈమధ్యే అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును చూడాలి. యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగమవుతోందని, మాంసాన్ని ఫోరెన్సిక్‌ లాబొరేటరీ పరీక్షలకు పంపకుండానే అమాయకుల్ని నిందితులుగా ఇరికిస్తున్నారని న్యాయమూర్తి జస్టిస్‌ సిద్ధార్థ వ్యాఖ్యానించారు. గోశాలల్లో వట్టి పోయిన ఆవుల్ని, వయసు ముదిరిన ఆవుల్ని నిరాకరించడంతో అవి బయట సంచరిస్తూ  సమా జానికి సమస్యగా మారుతున్నాయని అన్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో తెలియదు. ఇక యూపీలో గోసంరక్షణ పేరుతో వ్యక్తుల్ని కొట్టిచంపడం, విధ్వంసాలకు పాల్పడటం ఎక్కువే.

రెండేళ్లక్రితం బులంద్‌షహర్‌ సమీపంలో ఆవు కళేబరాలు కనబడ్డాయని రెచ్చిపోయిన దుండగులు శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమైన ఒక ఇన్‌స్పెక్టర్‌ను కాల్చిచంపారు. విధ్వంసానికి దిగి అక్కడి అవుట్‌పోస్టుకు నిప్పెట్టడంతోపాటు అనేక వాహనాలు తగలబెట్టారు. ఆ కేసు ఇప్పటికీ ఎటూ తేలలేదు. నిందితులు చాన్నాళ్లక్రితమే బెయిల్‌పై విడుదల య్యారు. బయట సంచరించే పశువుల్ని సంరక్షించడానికి అవసరమైన షెడ్ల నిర్మాణంకోసం యూపీ ప్రభుత్వం మద్యం, టోల్‌ గేటు పన్నులపై ‘గో కల్యాణ్‌ సెస్‌’ను 0.5 శాతం విధించింది. అలాగే హోల్‌సేల్‌ మార్కెట్ల ఆదాయంపై ఒక శాతం లెవీ వసూలు చేస్తోంది. గోవధకు పాల్పడ్డారన్న ఆరోపణపై 76మందిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. పశువుల పరిరక్షణ భావన ఉన్నతమైనదని కర్ణాటక పాలకులు అనుకుంటూండవచ్చు. కానీ అందువల్ల ఉత్పన్నమయ్యే సమస్యలేమిటన్నది చూడాల్సిన బాధ్యత కూడా వారిపై వుంది. వట్టి పోయిన, సాగుకు పనికిరాని పశువుల్ని రైతులు ఏం చేయవచ్చునో బిల్లు చెప్పడం లేదు. కొత్త పశు వుల్ని కొనుగోలు చేయాలంటే పాతవాటిని అమ్మడమే ఏరైతుకైనా వుండే మార్గం. వాటివల్ల రాబడి వచ్చినంతకాలం మాత్రమే ఆ పశువులను రైతులు పోషించగలరు. హైబ్రీడ్‌ రకం పశువులకు దాణా కోసం రైతు కనీసం రోజుకు రూ. 200 వెచ్చించాల్సివస్తుందని ఒక అంచనా. పాలకులకుండే ‘సదుద్దేశం’ నెరవేరడం కోసం రైతులు అంత వ్యయం భరించాలనడం ఏం న్యాయం? దేశ జనా భాలో 15 శాతంమందికి పశు మాంసం ఆహారంగా వుంది.

వీరంతా అట్టడుగు వర్గాలవారే. వీరికి తక్కువ ఖర్చుతో లభించే పోషకాహారం పశు మాంసం ఒక్కటే. అలాంటి వారికి ప్రభుత్వం చూపే ప్రత్యామ్నాయం ఏమిటో తెలియదు. అసలు ఏం  తినాలో నిర్ణయించుకోవడమనేది పూర్తిగా వ్యక్తి గత విషయం. ఎవరింట్లో ఏం వండుకుంటున్నారో, ఎవరి రిఫ్రిజిరేటర్‌లో ఏముందో చూడటం వారి వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడం అవుతుంది. పశు సంరక్షణ పేరుతో కొందరు దుండగులు అకారణంగా దాడి చేసిన ఉదంతాలు కర్ణాటకలో కూడా తక్కువేమీ కాదు. వాటి గురించి తెలిసి కూడా పశు సంరక్షకులకు రక్షణ వుంటుందనడం సబబో కాదో ప్రభుత్వం ఆలోచించాలి.  ఇప్పటి కైనా మించిపోయింది లేదు... అన్ని వర్గాల అభిప్రాయం తెలుసుకుని, చట్టసభల్లో కూలంకషంగా చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని కర్ణాటక సర్కారు గుర్తించాలి. 

మరిన్ని వార్తలు